- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరిత విప్లవం వెనుక ఆరోగ్య సంక్షోభం.. గ్రామీణ భారతాన్ని కబళిస్తున్న పెస్టిసైడ్లు
హరిత విప్లవం తెచ్చిన రసాయన విప్లవం.. ఇప్పుడు గ్రామీణ భారతాన్ని నిశ్శబ్దంగా మింగేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: హరిత విప్లవం తెచ్చిన రసాయన విప్లవం.. ఇప్పుడు గ్రామీణ భారతాన్ని నిశ్శబ్దంగా మింగేస్తోంది. పచ్చని పొలాల వెనుక క్యాన్సర్లు, కిడ్నీ వైఫల్యాలు, నరాల బలహీనతలు, పునరుత్పత్తి లోపాలు మహమ్మారిలా విస్తరిస్తున్నాయి. ప్రముఖ పర్యావరణ, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి తన తాజా పరిశోధనాత్మక పత్రం ద్వారా ఈ ఘోరకలిని బట్టబయలు చేయగా.. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న కిడ్నీ రోగాల తీవ్రతను చూసి సీనియర్ నెఫ్రాలజిస్టులు సైతం ఈ ముప్పును నిర్ధారిస్తున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ ప్రజలు, రైతాంగం రోగాల బారిన పడుతున్నా.. భారత వైద్య వ్యవస్థ ఎందుకు గుర్తించలేకపోతోంది. దీని వెనుక ఉన్న లొసుగులను, తక్షణ చట్టపరమైన పరిష్కారాలపై కథనం.
రోగాల వలయంలో పల్లెలు..
దేశంలోని వ్యవసాయ ప్రాంతాల్లో క్యాన్సర్లు, క్రానిక్ కిడ్నీ డిసీజెస్(సీకేడీ), రక్త సంబంధిత రుగ్మతలు విపరీతంగా పెరుగుతున్నాయి. సీనియర్ నెఫ్రాలజిస్టుల అభిప్రాయం ప్రకారం.. ఒకేసారి ఎక్కువ మోతాదులో పురుగుల మందు తాగితే వెంటనే చనిపోతారు. కానీ, పొలాల్లో మందులు కొట్టేటప్పుడు, ఆ ఆహారాన్ని తినేటప్పుడు రోజూ కొద్దికొద్దిగా శరీరంలోకి చేరే రసాయనాలు(సబ్‌ఆప్టిమల్ డోస్) పదేళ్ల తర్వాత క్యాన్సర్‌గానో, కిడ్నీలు పూర్తిగా పాడయ్యేలాగో మారుస్తున్నాయి. ఇది ముమ్మాటికీ నెమ్మదిగా చంపే స్లో పాయిజనే. దీనిపై ప్రొఫెసర్ నరసింహారెడ్డి తన పరిశోధనలో దేశంలోని 4 భయంకరమైన ఉదాహరణలను ఆధారాలతో సహా ప్రస్తావించారు.
పంజాబ్ క్యాన్సర్ బెల్ట్: పంజాబ్‌లోని మాల్వా ప్రాంతం రాష్ట్రంలో వాడే మొత్తం పురుగుల మందుల్లో 75% ఇక్కడే వాడుతోంది. ఫలితంగా ఇక్కడ క్యాన్సర్ రేటు జాతీయ సగటు(లక్షకు 80) కంటే భయంకరంగా పెరిగి లక్షకు 136 కేసులుగా నమోదవుతోంది.
ఉద్దానం నెఫ్రోపతీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్దానం ప్రాంతంలో వేలాది మందిని బలితీసుకుంటున్న అంతుపట్టని వింత కిడ్నీ వ్యాధుల వెనుక కూడా ఈ రసాయనాల పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం.
కాసరగోడ్ ఎండోసల్ఫాన్ విషాదం: కేరళంలో ఎండోసల్ఫాన్ వాడకం వల్ల తరాల తరబడి సాగిన అంగవైకల్యాల ఘోరం.
మహిళల్లో తీవ్ర రక్తహీనత(ఎనీమియా): నిరంతరం పొలాల్లో రసాయన ప్రభావానికి లోనవడం వల్ల గ్రామీణ మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత బారిన పడుతున్నారు.
వైద్య వ్యవస్థ వైఫల్యం.. 4 ప్రధాన కారణాలు
నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అమల్లోకి తెచ్చిన కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ సిలబస్ ఆధునిక పురుగు మందుల క్లాసెస్ గురించి డాక్టర్లకు నేర్పించడంలో విఫలమైంది. ఒక రోగి వచ్చినప్పుడు.. అతని వృత్తి ఏంటి? ఎలాంటి వాతావరణంలో పనిచేస్తున్నాడు? (ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్ మెంటల్ హిస్టరీస్) అనే అంశాలను తెలుసుకునే కనీస శిక్షణ వైద్య విద్యార్థులకు అందడం లేదు.
మూడు నిమిషాల నరకం..
మన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక రోగిని డాక్టర్ పరీక్షించే సగటు సమయం 3 నిమిషాల కంటే తక్కువ. ఈ స్వల్ప వ్యవధిలో రోగి పొలంలో ఏ మందు కొట్టాడు? ఎంతకాలం నుంచి ఆ కెమికల్స్ పీలుస్తున్నాడు? అని లోతుగా విశ్లేషించే హిస్టరీ టేకింగ్ అసాధ్యంగా మారింది.
ల్యాబ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ శూన్యం
పురుగుల మందుల తీవ్రతను కనిపెట్టేందుకు అత్యంత కీలకమైన కోలినెస్టరేస్ అస్సేస్, పెస్టిసైడ్ రెసిడ్యూ అనాలిసిస్ వంటి పరీక్షలు వ్యవసాయ ఆధారిత జిల్లాల్లోని హెడ్‌క్వార్టర్స్ ఆస్పత్రుల్లో గానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) గానీ అందుబాటులో లేవు. పరీక్షలు లేనప్పుడు నిర్ధారణ ఎలా సాధ్యమనేదే ప్రశ్నార్థకం.
ఫార్మా కంపెనీల చేతుల్లో సీఎంఈలు
డాక్టర్ల నాలెడ్జ్ పెంచేందుకు ఉద్దేశించిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్(సీఎంఈ) ప్రోగ్రామ్‌లు పూర్తిగా ఫార్మాస్యూటికల్ కంపెనీల ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నాయి. వ్యవసాయ రసాయనాల విషప్రభావం(అగ్రికల్చర్ కెమికల్ టాక్సికాలజీ) అనే అంశంపై కనీస అవగాహన సదస్సులు జరగడం లేదు.
పెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ బిల్లులో మార్పులు రావాలి!
శ్రీలంక, కాలిఫోర్నియా, సౌత్ ఆఫ్రికా, యూరోపియన్ యూనియన్, అలాగే అంతర్జాతీయ సంస్థ ఎఫ్ఏఓకు చెందిన ఏషియన్ ఐపీఎం ప్రోగ్రామ్‌లు ఈ సమస్యను అధిగమించాయి. అక్కడ డాక్టర్లు గుర్తించే క్లినికల్ కేసుల ఆధారంగానే పురుగుల మందుల నియంత్రణ జరుగుతుంది. కానీ మన దేశంలో అలాంటి వ్యవస్థే లేదు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముందుకు తెస్తున్న పెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ బిల్లు ఒక అద్భుతమైన అవకాశం. ఈ చట్టంలో వైద్య రంగాన్నిఒక కీలక భాగస్వామిగా మార్చాలి. ప్రతి డాక్టర్ పురుగుల మందుల వల్ల వచ్చే రోగాలను తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదించేలా నిబంధనలు పెట్టాలి. కేంద్ర రసాయనాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్(ఎఫ్ఎస్ఎస్ఏఐ)లు సమన్వయంతో స్పందించి మెడికల్ సిలబస్‌లో మార్పులు చేయాలి. ప్రతి గ్రామీణ ఆస్పత్రిలో పెస్టిసైడ్ టాక్సిసిటీని గుర్తించే ల్యాబ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. రసాయన కంపెనీల లాభాల కంటే.. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆరోగ్యం మిన్న అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.






