‘గ్రేటర్’ రాజకీయం షురూ.. సర్వే రిపోర్ట్ బాగుంటేనే బరిలోకి!

by Kema Shiva Kumar |

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీ ఆశావహులు ‘సైలెంట్ సర్వేలు’ చేయిస్తున్నారు. టికెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా సర్వే సంస్థలను ఆశ్రయిస్తున్నారు.

‘గ్రేటర్’ రాజకీయం షురూ.. సర్వే రిపోర్ట్ బాగుంటేనే బరిలోకి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని కమలనాథులు గ్రేటర్ ​ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఏ సమయంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ ​రావొచ్చని గెలుపు గుర్రాల వేట మొదలు పెట్టారు. మూడు కమిషనర్ల పరిధిలో 300 సీట్లు ఉండటంతో కనీసం రెండు మేయర్ ​సీట్లు కైవసం చేసుకునేందుకు రాజకీయ వ్యుహాలకు పదును పెడుతున్నారు. పార్టీ సీనియర్ల పోకడలు పసిగట్టిన కార్పొరేటర్ ​ఆశావహులు తమ బలాలపై సర్వేలు చేయించుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో పేరుమోసిన సర్వే సంస్థలు ఐదారు ఉండటంతో వాటిని ఆశ్రయిస్తూ తాను పోటీ చేస్తే విజయం సాధిస్తానా అనే అంశాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్​ఎస్​, బీజేపీల నుంచి ప్రతి డివిజన్​లో నలుగురు నుంచి ఐదుగురు పోటీ పడుతున్నారు. అందులో ప్రజల్లో ఎక్కువ బలమున్న నేతలకే పార్టీ బీఫామ్ ​ఇస్తుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ సర్వే పూర్తి చేసినట్లు ప్రచారం సమాచారం. వారికి తామేమి తక్కువని బీజేపీ ఆశావహులు సైతం ముందుగానే సర్వే చేయిస్తూ పోటీలో నిలవాలా, పార్టీ టికెటు ఇచ్చి వారికి మద్దతు పలకాలనే భావనలో ఉన్నారు.

సందడిగా మారిన సర్వే సంస్థల కార్యాలయాలు

ఎన్నికల నోటిఫికేషన్ ​రాకముందే తన రాజకీయ జీవితం పరిక్షించుకునేందుకు కార్పొరేటర్​ బరిలో నిలిచే నేతలంతా సర్వే సంస్థల వద్దకు వెళ్లడంతో కార్యాలయాలు నాయకులతో సందడిగా మారాయి. రాజధానిలో చాలా ఆఫీసులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో గంటల కొద్ది వేయిట్ ​చేస్తూ సర్వే ఏవిధంగా చేస్తారో వివరాలు తెలుసుకుని తమకు ఫలానా విధంగా సర్వే కావాలని డిమాండ్ చేస్తూ ఆయా సంస్థలు అడిగిన ప్యాకేజీలు ముట్టజెపుతున్నారు. ముందుగా తమ పేరు డివిజన్​లో ఎంతమందికి తెలుసు, ఏ కులం వారు తమకు, తమపార్టీకి అనుకూలంగా ఉన్నారో వివరాలు ఇస్తే రూ.4 లక్షల తీసుకుంటున్నారు. పార్టీ టికెట్ ఇస్తే ఎన్నికల ప్రచారం పూర్తి అయ్యే వరకు పనిచేయాలంటే ఒక అభ్యర్థి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.30 వరకు డిమాండ్​ చేస్తున్నారు. అభ్యర్థలు ఏ రోజు ఎక్కడ ప్రచారం చేయాలి, ఏ అంశాలు మాట్లాడాలి, వ్యతిరేకత ఉన్న చోటు ఎలాంటి హామీలు ఇవ్వాలని వంటి అంశాలు రాసిస్తారు. అదే విధంగా ప్రతి సర్వే సంస్థ ఒక డివిజన్​లో ఒకే అభ్యర్థికి మాత్రమే ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు చేస్తుంది. ఐదు మంది పోటీ చేస్తే ముందు ఎవరు వచ్చి ప్యాకేజి చెల్లిస్తారో వారికి పనిచేస్తారు. ఇద్దరికి కూడా సంస్థలు పనిచేయవు.

కార్పొరేటర్​ టికెట్లు వేట మొదలైంది

ఆయా పార్టీలు గ్రేటర్​లో పాగా వేసేందుకు డివిజన్​కు నలుగురు అభ్యర్థులను గుర్తిస్తున్నాయి. సీనియర్లతో పరిచయం ఉన్న స్ధానిక నేతలకు ఈ విషయం తెలియడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈసారి తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. తనకు ఆర్థిక, అంగబలం ఉందని, తన డివిజన్​లో పలు స్వచ్ఛం కార్యక్రమాలు చేపటినట్లు చెబుతున్నారు. పార్టీ కోసం 20 ఏళ్లుగా శ్రమిస్తున్నారని, గతంలో పలుమార్లు టికెట్ వచ్చినట్లే వచ్చి జారిపోయిందని, ఈసారి తనకు తప్పకుండా ఇవ్వాలని ప్రాధేయ పడుతున్నట్లు తెలిసింది.

Next Story