గ్రేటర్ హైదరాబాద్ 2.0.. మున్సిపాలిటీల విలీనంపై మేధోమథనం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-30 02:04:31  IST  )

ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

గ్రేటర్ హైదరాబాద్ 2.0.. మున్సిపాలిటీల విలీనంపై మేధోమథనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్‌లకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈనెల 25న జరిగిన జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో 27 మున్సిపాలిటీల విలీన అంశాన్ని టేబుల్ ఎజెండాగా పెట్టి ఆమోదించారు. స్టడీ చేసి రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం సైతం సంబంధిత ఆఫీసర్లకు ఆదేశించింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులుగా రెండు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో మున్సిపాలిటీల విలీనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించినట్టు తెలిసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డులను డీలిమిటేషన్ చేయాలని డిస్కషన్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే కాప్రా, బేగంపేట్ సర్కిళ్ల పరిధిలో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన 28 సర్కిళ్ల పరిధిలో పనులు చేపట్టేందుకు సమావేశాలు నిర్వహించినట్టు తెలిసింది.

150 నుంచి 250కు పెరగనున్న వార్డులు

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 వార్డుల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జనాభా ఉంది. కొన్ని వార్డుల్లో లక్షల్లో ఉంటే మరి కొన్నింటిలో వేలల్లో ఉంది. వీటన్నింటినీ సమానంగా చేయడంతో పాటు వార్డుల ఏరియాను సైతం మార్చాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 150 వార్డుల సంఖ్యను 250 చేసేందుకు ఆఫీసర్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.

నియోజకవర్గంలో రెండు సర్కిళ్లు

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. ఒక్కో సర్కిల్ రెండు, మూడు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. దీన్ని సమూలంగా మార్చనున్నారు. వార్డుల సంఖ్య పెంచడంతో పాటు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రెండేసి చొప్పున సర్కిళ్లు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వార్డుల పునర్విభజనపై ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చిన తర్వాత 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీ రిపోర్టు ఆధారంగా 27 మున్సిపాలిటీల్లో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ కొలిక్కిరానుందని విశ్వసనీయవర్గాల సమాచారం.

Next Story