Municipal elections: జాతర సమయంలో ఎన్నికలేంటి?.. బీఆర్ఎస్ అభ్యంతరం

by Prasad Jukanti |

మున్సిపల్ ఎన్నికలపై హడావుడి షెడ్యూల్ విషయంలో గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

Municipal elections: జాతర సమయంలో ఎన్నికలేంటి?.. బీఆర్ఎస్ అభ్యంతరం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నగారా మోగింది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే నిన్నే షెడ్యూల్ ప్రకటించి ఇవాళ నోటిఫికేషన్ వెలువరించడం పట్ల బీఆర్ఎస్ (BRS) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఇవాళ బహిరంగ లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగా? లేక అధికార పార్టీ కుట్రా?నా అని ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే మొదటిసారి షెడ్యూల్, నోటిఫికేషన్ మధ్య ఒక్క రోజు కూడా గడువు ఇవ్వకపోవడం దారుణం అని తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక "మేడారం జాతర"ను ఎన్నికల సంఘం విస్మరించిందని విమర్శించారు. కోట్లాది మంది భక్తులు మేడారం వెళ్లే సమయంలో ఎన్నికలా? ఇది ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడమేనన్నారు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వం చేతిలో తోలుబొమ్మలా మారిందని ఎన్నికలంటే ఆఫీసులో ఫైళ్లు క్లియర్ చేసినట్టు చుట్టేయడం కాదని అవి ప్రజాస్వామ్యానికి పునాదులన్నారు.

దేనికి ఈ హడావుడి?:

రాష్ట్రంలో ఏ రాజ్యాంగ సంక్షోభం లేకపోయినా ఇంత ఊపిరాడని హడావుడి ఎందుకు? అని ప్రశ్నించారు. సామ దాన భేద దండోపాయాలతో ఎన్నికలను ముగించాలని ఎన్నికల సంఘం చూస్తోందని ఈ షెడ్యూల్ ప్రతిపక్షాలకు, మహిళలకు, కొత్త అభ్యర్థులకు శాపంగా మారితే అధికార పార్టీకి వరంగా మారిందన్నారు. ఇది సమాన అవకాశాల పోటీ కాదు అడ్డగోలుగా సృష్టించిన వ్యవస్థీకృత అసమానత అని ఆరోపించారు. సమయం కుదించడం వల్ల ఎన్నికలు పైసలు, మద్యం, కండబలంతో నడిచే తంతుగా మారుతాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కై స్థానిక సంస్థల ఎన్నికలను మేనేజ్డ్ డ్రామాగా మార్చేశారని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్ వెంటనే మున్సిపల్ ఎన్నికలో నోటిఫికేషన్ షెడ్యూల్ అంశంలో జోక్యం చేసుకోవాని డిమాండ్ చేశారు.

Next Story