‘గ్రీన్ ఇండియా’కు గవర్నర్ శ్రీకారం.. సహజ వనరుల పొదుపుపై జాతీయ ఉద్యమం

by Ramesh Naini |

పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల పొదుపును ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన “గ్రీన్ ఇండియా -సేవ్ ఎనర్జీ, వాటర్ అండ్ ఫ్యూయల్” దేశవ్యాప్త అవగాహన పోస్టర్‌ను తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

‘గ్రీన్ ఇండియా’కు గవర్నర్ శ్రీకారం.. సహజ వనరుల పొదుపుపై జాతీయ ఉద్యమం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల పొదుపును ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన “గ్రీన్ ఇండియా -సేవ్ ఎనర్జీ, వాటర్ అండ్ ఫ్యూయల్” దేశవ్యాప్త అవగాహన పోస్టర్‌ను తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఇగ్నైటింగ్ మైండ్స్ మిషన్, దివ్య ప్రేమ్ సేవా మిషన్, ఇండియన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నెట్‌వర్క్ (ఐఎస్ఆర్ఎన్) సంయుక్తంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయి. దేశవ్యాప్తంగా పౌరులు తమ దైనందిన జీవితంలో పర్యావరణ అనుకూల విధానాలను అవలంబిస్తూ.. విద్యుత్, నీరు, ఇంధన వృథాను అరికట్టడమే ధ్యేయంగా ఈ జాతీయ అవగాహన యాత్రను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన నిర్వాహక సంస్థల కృషిని ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు. సహజ వనరులను కాపాడుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. భావితరాలకు సుస్థిర భవిష్యత్తును అందించాలంటే ఇంధనం, నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవడం అత్యంత అవసరమని, ఇందులో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీ కన్న కలలు

ప్రధాని నరేంద్ర మోడీ కన్న కలలకు అనుగుణంగానే ఈ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా వనరుల పొదుపును బాధ్యతగా స్వీకరిస్తే, సుస్థిర అభివృద్ధి వైపు దేశం మరింత వేగంగా దూసుకుపోతుందన్నారు. ఈ సందేశాన్ని గ్రామ పంచాయతీలు, విద్యాసంస్థలు, యువజన సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. సహజ వనరులను ఆదా చేయడం దేశ ఆర్థిక వృద్ధికి, జాతీయ వికాసానికి ఎంతో దోహదపడుతుందని ప్రతినిధులు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా విద్యా కార్యక్రమాలు, కమ్యూనిటీ భాగస్వామ్యాల ద్వారా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. నిర్వాహక సంస్థల సంయుక్త ప్రతినిధి మంకెన శ్రీనివాస్ రెడ్డి, ఐనవోలు మురళీధర్ రెడ్డి, ఆర్.వి.ఆర్. ప్రసాద్, ఎం. విజయ్ భాస్కర్ రెడ్డి, పుతోట లూయిస్ అరుల్ రాజ్, ప్రశాంత్, హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) అధ్యక్షుడు ఎ. దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story