నీలోఫర్‌ హాస్పిటల్‌పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులకు ఆరోగ్య మంత్రి కీలక ఆదేశాలు

by Ramesh Naini |

చిన్న పిల్లల వైద్యానికి ప్రఖ్యాతి గాంచిన ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

నీలోఫర్‌ హాస్పిటల్‌పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులకు ఆరోగ్య మంత్రి కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: చిన్న పిల్లల వైద్యానికి ప్రఖ్యాతి గాంచిన ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్ (Niloufer Hospital) పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) అధికారులను ఆదేశించారు. నీలోఫర్ ఆసుపత్రిలో సౌకర్యాల పెంపునకై గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నీలోఫర్ ఆస్పత్రిలో అన్ని విభాగాలను పటిష్ట పర్చాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీలోఫర్ లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పీజీ విద్యార్థులకు ఆసుపత్రిలో హాస్టల్ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చే రోగుల సహాయకులకు వసతి కల్పనపై ప్రత్యేక చర్యలు తీసుకునాలన్నారు. రోగుల సహాయకులకు వసతి సౌకర్యం ఆసుపత్రిలోనే కల్పించాలన్నారు. క్యాడర్ స్ట్రెంత్‌కు అనుగుణంగా సిబ్బంది నియామకంపై దృష్టిసారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. (Osmania Medical College) ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రుల్లో రెండవ అత్యధిక ఓపీ, ఐపీ వైద్య సేవలు అందిస్తున్న నిలోఫర్ ఆసుపత్రికి నిధుల కేటాయింపును మరింతగా పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని భవనాల పరిస్థితిపై టీజీఎంఎస్ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి చర్చించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, హెచ్ఆర్, ఎక్విప్ మెంట్లు రిపేర్లు, మంచినీటి సౌకర్యం, శానిటేషన్, డ్రైనేజీ సిస్టం, ఇన్ఫ్రా, రోగులు, వారి సహాయకులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టినా, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీందర్ రెడ్డి, డీఎంఈ డా. నరేంద్ర కుమార్, అదనపు డీఎంఈ డా. వాణి, నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. విజయ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Next Story