- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఏఎస్‌లపై సర్కార్ శరాఘాతం..! త్వరలో భారీ స్థాయిలో బదిలీలు
సెక్రెటేరియట్, హెచ్ఓడీల్లో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులపై త్వరలోనే బదిలీ వేటు పడనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: సెక్రెటేరియట్, హెచ్ఓడీల్లో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులపై త్వరలోనే బదిలీ వేటు పడనుంది. కొందరు ఆఫీసర్లు ప్రభుత్వ ప్రయారిటీలను పట్టించుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. దీంతో సర్కారుకు చెడ్డ పేరు వస్తున్నదని సీఎం రేవంత్ ఈ మధ్య జరిగిన సమీక్షా సమావేశంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. పనితీరు సరిగాలేని ఆఫీసర్లను అక్కడి నుంచి తప్పించి వారి స్థానంలో కొత్తవారిని అపాయింట్ చేసేందుకు సీఎంఓ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
సద్వినియోగం చేసుకోని ఆఫీసర్లు
బీఆర్ఎస్ హయాంలో కొందరు ఆఫీసర్లకే ప్రయారిటీ ఇచ్చారు. పదేళ్ల పాటు సదరు అధికారులే ప్రాధాన్య పోస్టుల్లో కొనసాగారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో కొందరిని అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసింది. మరి కొంతమందిని అలాగే కొనసాగించింది. అయితే, ‘బీఆర్ఎస్‌లో టైమ్‌లో ఎవరికైతే పెద్దపీట వేశారో, ఇప్పుడు కూడా వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు’ అని చాలా మంది ఐఏఎస్ అధికారులు తమ ఇంటర్నల్ మీటింగ్స్‌లో ఆవేదన చెందారు.ఈ విషయం గ్రహించిన సీఎం రేవంత్.. స్పెషల్ సీఎస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయిలో ఉన్న ఐఏఎస్‌లను పక్కన పెట్టి జూనియర్ అధికారులకు సెక్రెటేరియట్, హెచ్ఓడీల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని వారు ఉపయోగించుకోకుండా చాలా మంది ఐఏఎస్‌లు సొంత వ్యవహారాలకు ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు. ‘ఎక్కడ ఏ రకమైన ప్రయోజనం ఉంటుంది? ఎలాంటి లబ్ధి పొందవచ్చు?’ అనే అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు విమర్శలు వచ్చాయి. మరోవైపు సర్కారు ప్రయారిటీలను పెద్దగా పట్టించుకోకుండా ఆఫీసుకు వచ్చామా? వెళ్లామా? అనే తీరుగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.
బెనిఫిట్స్ వచ్చే ఫైల్స్ మీదే ఇంట్రెస్ట్..
కొందరు సెక్రెటరీలు, డైరెక్టర్లు, కమిషనర్లు తమ వద్దకు వచ్చే ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో చొరవ చూపడం లేదని విమర్శలున్నాయి. ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన ఫైల్స్‌ను సైతం వారాల కొద్ది పెండింగ్‌లో పెడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు సెక్రెటరీలు, హెచ్ఓడీలు సంబంధిత మంత్రులు ఫోన్ చేసి అడిగినా ఫైల్స్ క్లియర్ చేయడం లేదని ఆరోపణలున్నాయి. ఇంకొందరు ఆఫీసర్లు పదేపదే ఫోన్లు చేసి ఫాలో ఆఫ్ చేస్తే తప్ప ఫైల్స్ చూడట్లేదని టాక్. మరికొందరు ఆఫీసర్లు సీఎంఓ ఆఫీసు నుంచి ఫోన్ చేసి అడిగితే తప్ప ఫైల్ మీద సంతకం చేయడం లేదని తెలుస్తున్నది. ఇలాంటి ఆఫీసర్లను అప్రాధాన్య పోస్టుల్లో ఆపాయింట్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది.
పేషీల్లో సొంత టీమ్..
కొందరు ఆఫీసర్లు కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పటివరకు అక్కడ పనిచేస్తున్న పేషీ స్టాఫ్‌ను మార్చారు. తమ ‘వ్యవహారాలను’ చక్కబెట్టే వాళ్లను పీఏ, పీఎస్‌గా అపాయింట్ చేసుకున్నారు. ఆ స్టాఫ్‌కు ఫైళ్లపై పెత్తనం ఇచ్చారని విమర్శలున్నాయి. కొందరు సెక్రెటరీ తరపున వకల్తా తీసుకుని ఫైల్స్ క్లియరెన్స్ కోసం ఎంత మొత్తంలో ముట్టచెప్పాలో బేరసారాలు సైతం చేస్తుంటారని ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు అధికారులు సెక్రెటేరియట్, డైరెక్టరేట్‌లో కాకుండా బయట ప్రత్యేకంగా ఆఫీసులు ఏర్పాటు చేసుకుని అక్కడే సెటిల్మెంట్స్ చేస్తుంటారని ప్రచారం ఉంది. అక్కడికే తమ పరిధిలో కాంట్రాక్టు పనులు చేసే సంస్థల ప్రతినిధులను పిలిపించుకుని సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. ఈ విషయాలను గ్రహించిన సీఎం రేవంత్ సదరు ఆఫీసర్లను తప్పించి, కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
‘ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించం. ఇప్పటికైనా అలసత్వం వీడాలి. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు’ - ఇటీవలి సమీక్షలో సీఎం రేవంత్ కామెంట్స్






