- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GIS మాస్టర్ ప్లాన్లపై సర్కార్ నజర్.. వరంగల్, నల్లగొండ టౌన్ ప్లాన్లు పూర్తి
కేంద్ర ప్రభుత్వం సంస్కరణల్లో భాగంగా ప్రతి పట్టణానికి జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్) ఆధారిత మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం సంస్కరణల్లో భాగంగా ప్రతి పట్టణానికి జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్) ఆధారిత మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) విభాగం నిర్ణయించింది. అందుకనుగుణంగానే మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన డ్రోన్ సర్వేను సర్వే ఆఫ్ ఇండియా, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా చేపడుతున్నారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ ప్రక్రియ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని డీటీసీపీ అధికారులు చెబుతున్నారు.
వరంగల్, నల్లగొండకు పూర్తి..
రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్‌ను తయారుచేయడంతోపాటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నల్లగొండ మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్ పనులు పూర్తికావడంతో పాటు ప్రభుత్వం ఆమోదించింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి పట్టణాల మాస్టర్ ప్లాన్‌లను సైతం ప్రభుత్వం ఆమోదించింది. అయితే సూర్యాపేట, మిర్యాలగూడ, మహబూబ్ నగర్ పట్టణాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పనులు తుది దశలో ఉన్నాయి. భూపాలపల్లి, దేవరకొండ, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, ఆందోల్, జోగిపేట్ ముసాయిదా మాస్టర్ ప్లాన్‌లకు ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉంది. ఈ నగరాల్లో ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ ఏరియాలు, కమర్షియల్ ప్రాంతాలు, చెరువులు, ఖాళీ స్థలాలతో పాటు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో డిజిటల్ సర్వేలో గుర్తించిన విషయం విధితమే.
ఫైనల్ మాస్టర్ ప్లాన్‌కు కసరత్తు
మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తిచేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు వేర్వేరుగా మాస్టర్ ప్లాన్‌లను రూపొందించారు. ఈ రెండు మున్సిపాలిటీలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రెండింటికి ఫైనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మంచిర్యాల సైతం మున్సిపాలిటీగా ఉన్నప్పుడే మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. కానీ ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చారు. దీన్ని సైతం అధికారులు మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
సర్కార్‌కు కామారెడ్డి మాస్టర్ ప్లాన్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశం రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీన్ని గుణపాఠంగా తీసుకున్న అధికారులు అలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు డీటీసీపీ అధికారులు చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్‌లో 50 శాతం రెసిడెన్షియల్ జోన్, 7 శాతం ఇండస్ట్రియల్ జోన్, మిగిలిన 43 శాతం ఇతర అంశాలకు కేటాయించాల్సి ఉంటుంది. కానీ కామారెడ్డి పట్టణంలో వ్యవసాయ భూములను సైతం ఇండస్ట్రియల్ జోన్‌లో చూపించడంతోనే వివాదాస్పదమైందని పలువురు టౌన్ ప్లానింగ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశాన్ని ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం సూచనల మేరకు మార్పులు, చేర్పులు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.






