మద్యం ప్రియుల జేబులకు భారీ చిల్లు.. మళ్లీ పెరగబోతున్న ధరలు!

by Gantepaka Srikanth |

తెలంగాణలో మద్యం ప్రియుల జేబులకు భారీ చిల్లు పడనుంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

మద్యం ప్రియుల జేబులకు భారీ చిల్లు.. మళ్లీ పెరగబోతున్న ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మద్యం ప్రియుల జేబులకు భారీ చిల్లు పడనుంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. జూన్ 2వ తేదీ (తెలంగాణ అవతరణ దినోత్సవం) తర్వాత ఈ పెరిగిన ధరలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో విక్రయించే అన్ని రకాల మద్యం బ్రాండ్లపై కనీసం 10 శాతం నుండి 15 శాతం మేర ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల సాధారణ, మీడియం బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్ల ధరలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. పెరిగిన ధరల ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆర్థిక, అబ్కారీ శాఖలు భావిస్తున్నాయి.

30 శాతం వరకు పెంచాలని కమిటీ సిఫార్సు..

మద్యం ధరల మార్పులు, ఆదాయ వనరుల పెంపుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గతంలోనే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి తన కీలక ప్రతిపాదనలను (రిపోర్టును) అందజేసింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, పొరుగు రాష్ట్రాల్లోని ధరలను బట్టి తెలంగాణలో మద్యం రేట్లను ఏకంగా 25 శాతం నుండి 30 శాతం వరకు పెంచవచ్చనీ ఈ కమిటీ ప్రభుత్వానికి సీఫార్సు చేసినట్లు తెలుస్తోంది. త్రిసభ్య కమిటీ 25% 30% పెంపును ప్రతిపాదించినప్పటికీ, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మాత్రం 10% నుండి 15% మధ్యలోనే ధరల పెంపును పరిమితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 2వ తేదీ లోపు ఈ ఫైలుపై ముఖ్యమంత్రి తుది ముద్ర వేసే అవకాశం ఉంది. ఈ ధరల పెంపు గనుక ఖరారైతే, రాష్ట్రంలో బీర్లు, ఐఎంఎల్ (IML) లిక్కర్ ధరలు సామాన్యుడికి మరింత భారం కానున్నాయి.

Next Story