- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ ‘రైతు గోస యాత్ర’పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్
బీజేపీ 'రైతు గోస యాత్ర'పై నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులను మోసం చేసిన బీజేపీ, బీఆర్ఎస్‌కు బీ-టీమ్‌లా మారి డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ చేపట్టిన ‘రైతు గోస యాత్ర’పై నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు రైతుల పేరుతో పసలేని, పనికిమాలిన యాత్రలు చేస్తూ రాజకీయం చేయడం మానుకోవాలని హితవుపలికారు. కమలం నేతలు యాత్రలు చేయాల్సింది తెలంగాణలో కాదని, ఢిల్లీలో అని ఎద్దేవా చేశారు. గత సంవత్సరం రాష్ట్రంలో పండించిన మొత్తం పంటను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు (లిఫ్ట్) చేసి ఉంటే నేడు రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని మండిపడ్డారు. తెలంగాణలో ఎంత ధాన్యం పండింది? అందులో కేంద్రం ఎంత కొనుగోలు చేసింది? అనే విషయాలపై ముందు బీజేపీ సమాధానం చెప్పాలని వేముల విరేశం డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి మేలు చేయలేని బీజేపీ నేతలు, ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి లేనిపోని మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో రైతులను అత్యధికంగా మోసం చేసిన ఏకైక పార్టీ బీజేపీనేనని దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని వీరేశం స్పష్టం చేశారు. ప్రస్తుతం హమాలీల కొరత వల్ల అక్కడక్కడా కొంత ఇబ్బంది ఎదురవుతున్నప్పటికీ, ఆ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామని వివరించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యంతో సహా ప్రతి గింజను చివరి వరకు కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ (BRS) కు 'బి-టీమ్' లా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలు పక్కనపెట్టి, తెలంగాణ రైతుల సమస్యలను ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఈ సందర్భంగా విప్ వేముల వీరేశం హితవు పలికారు.






