బీఆర్ఎస్ పార్టీ పని ఖ‌తం.. తెలంగాణ భ‌వ‌న్‌కు తాళం : ప్రభుత్వ విప్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అద్భుత విజ‌యం సాధించిందని, ప‌ట్టణ ప్రజ‌లు మా ప్రభుత్వ ప‌నితీరుకు ఆక‌ర్షితుల‌య్యారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ పని ఖ‌తం.. తెలంగాణ భ‌వ‌న్‌కు తాళం : ప్రభుత్వ విప్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అద్భుత విజ‌యం సాధించిందని, ప‌ట్టణ ప్రజ‌లు మా ప్రభుత్వ ప‌నితీరుకు ఆక‌ర్షితుల‌య్యారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. 90 కి పైగా మున్సిపాలిటీలు, 1500 ల‌కు పైగా కౌన్సిల‌ర్లు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుందని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ పని ఖ‌తం అయిందని, తెలంగాణ భ‌వ‌న్‌కు తాళం వేసుకోండి అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెంలో ప్రజ‌లు కాంగ్రెస్, సీపీఐ పార్టీల‌ను ఆశ్వీర‌దించారు..బీఆర్ఎస్ పార్టీకి కేవ‌లం 8 స్థానాలు మాత్రమే వ‌చ్చాయని ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ క‌న్నింగ్ పాలిటిక్స్ మానుకోవాలని ఆది శ్రీనివాస్ హితవు పలికారు.

ఇక టీఆర్ఎస్ పార్టీ లేవ‌దు..

సీఎం రేవంత్ రెడ్డి పైన అక్కసుతోనే ఇంకా మాట్లాడుతున్నారని, పట్టణ ప్రజ‌లు సీఎం రేవంత్ రెడ్డికి, ఇందిర‌మ్మ పాల‌న‌కు మ‌ద్దతు పలికారు..ఇక టీఆర్ఎస్ పార్టీ లేవ‌దు.. మేం మొద‌టి నుంచి ఈ విష‌యం చెపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌కి పార్లమెంటు ఎన్నిక‌ల్లో గుండు సున్నా రాగా, ఇటీవల ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోయారని, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారని, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా చిత్తయ్యారని, వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్‌ని ప్రజ‌లు ఆశ్వీర‌దిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు క‌లిసినా కాంగ్రెస్‌కు ద‌రిదాపుల్లోకి కూడా రాలేదని, సింగ‌రేణి బెల్ట్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించిందని, సింగ‌రేణికి గుండెకాయ లాంటి రామ‌గుండం కార్పొరేష‌న్ లో కాంగ్రెస్ ఘ‌న‌ విజ‌యం సాధించిందని ఆది శ్రీనివాస్ తెలిపారు.

Next Story