- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యారేజీల రిపేర్లపై సర్కార్ అల్టిమేటం.. నవయుగ, అఫ్కాన్స్‌పై క్రిమినల్ చర్యలు?
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలకు నిర్మాణ సంస్థలదే బాధ్యతని స్పష్టం చేస్తూ, మరమ్మతులు చేయకుంటే సదరు సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదే అని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఒకవేళ కంపెనీలు ముందుకు రాకపోతే కఠినచర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నది. బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతుల బాధ్యత నిర్మాణ సంస్థలదే అని ప్రభుత్వం గట్టిగా చెబుతుండగా.. నిర్మాణ సంస్థలైన అఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఏ మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు నిర్మాణ సమయంలోనే జరిగిన లోపాల వల్లే బ్యారేజీ దెబ్బతిన్నదని ప్రభుత్వం స్పష్టం చేస్తూ.. పూర్తిస్థాయి బాధ్యత కంపెనీలదేనని కఠినంగా హెచ్చరిస్తున్నది. ఈ క్రమంలోనే మరోసారి నిర్మాణ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈసారి కంపెనీలు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. స్పందన సంతృప్తికరంగా లేకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయడం సహా నిర్మాణ సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టేందుకూ వెనకాడబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నిర్మాణ సమయంలోనే లోపాలు..
మేడిగడ్డ బ్యారేజీలో పియర్లు కుంగిపోవడం.. నిర్మాణ స్థిరత్వం దెబ్బతినడం వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రాజెక్టు నాణ్యతపై తీవ్రమైన సందేహాలు తలెత్తాయి. ఈ పరిణామాలపై ప్రభుత్వం నిర్వహించిన ప్రాథమిక సాంకేతిక సమీక్షల్లో నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించలేదని గుర్తించినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత, ఫౌండేషన్ స్థిరత్వం, డిజైన్ అమలు వంటి అంశాల్లో లోపాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పియర్ల స్థాపన సమయంలో భూగర్భ పరిస్థితులను సరైన విధంగా అంచనా వేయలేకపోయారని, దీని వల్లే కుంగిపోవడం వంటి ఘటనలు జరిగాయని సాంకేతిక వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణాల వల్ల సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకూ జరిగిన నష్టం సహజ కారణాల వల్ల కాకుండా నిర్మాణ లోపాల వల్లే అయినట్లు ప్రభుత్వం తేల్చింది. మేడిగడ్డ మాత్రమే కాకుండా అదే ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ నిర్మాణాలపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ మూడు బ్యారేజీలు కలిపి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అత్యంత కీలక భాగాలు కావడంతో వాటి భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
కంపెనీలకు మరోసారి నోటీసులు..!
ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ నిర్మాణ సంస్థలు పూర్తిస్థాయిలో బాధ్యతను అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి అఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిర్దిష్ట గడువులోగా సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బ్యారేజీల రిపేర్ ఖర్చులు భరించాల్సిందేనని తేల్చిచెప్పింది. అయితే.. ఈసారి కంపెనీలు తమ వాదనను సాంకేతిక కోణంలో వివరించే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. డిజైన్, భూగర్భ పరిస్థితులు, వరదల ప్రభావం వంటి అంశాలను ప్రస్తావిస్తూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చని సమాచారం. ప్రభుత్వం మాత్రం నిర్మాణ నాణ్యతలో లోపాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తున్నది. నిర్మాణ సంస్థలు ఒప్పంద నిబంధనల ప్రకారం పూర్తి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది.
భారీగా ఆర్థిక నష్టం..
మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినడం వల్ల ప్రభుత్వం భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు పనితీరు దెబ్బతినడంతో ప్రజాధనం వృథా అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు పునరుద్ధరణకు మరోసారి భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఖర్చును ప్రభుత్వంపై మోపకుండా నిర్మాణ సంస్థలే భరించాలని వెల్లడించింది. కంపెనీలు బాధ్యతను అంగీకరించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇందులో భాగంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడం, కంపెనీలను బ్లాక్‌లిస్ట్ చేయడం, నష్టపరిహారం వసూలు చేయడం వంటి చర్యలను పరిశీలిస్తున్నది. నిర్మాణ లోపాల వల్ల ప్రజా ఆస్తి దెబ్బతినడం తీవ్రమైన అంశమని, దీనిని కేవలం పరిపాలనా సమస్యగా కాకుండా న్యాయపరమైన అంశంగా కూడా పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్మాణ సంస్థలు తమ బాధ్యతను పూర్తిగా అంగీకరించడానికి సిద్ధంగా లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఇవ్వబోయే సమాధానం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.






