ఫారెస్ట్ ల్యాండ్స్ రక్షణకు సర్కారు పటిష్ట చర్యలు

by Malleboina Mahesh |

రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల పరిరక్షణకు అటవీ శాఖ పటిష్ట చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. భూములు ఆక్రమణకు గురి కాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని భావిస్తున్నది.

ఫారెస్ట్ ల్యాండ్స్ రక్షణకు సర్కారు పటిష్ట చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల పరిరక్షణకు అటవీ శాఖ (Forest Department) పటిష్ట చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. భూములు ఆక్రమణకు గురి కాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని భావిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ పరిధిలో 26.81 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఉండాలి. అయితే ఇప్పటి వరకు 2,16,801 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ఈ భూములను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా రక్షణ గోడలు, ఫెన్సింగ్, బౌండరీ ఫిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాలకు సమీపంలో ఉన్న అటవీ భూములను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు (Real estate traders) వారి భూములకు ఆనుకొని, సమీపంలో ఉన్న అటవీ భూములను ఆక్రమించి వారి వెంచర్లలో కలిపేసుకుని విక్రయాలు చేపడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పట్టా భూములకు దగ్గరగా ఉన్న అటవీ భూమిని కూడా తమ భూములకు వేసిన ఫెన్సింగ్ (Fencing)తో కలిపేసుకుని ఆక్రమిస్తున్నారు.

మరికొన్ని జిల్లాల్లో అయితే పోడు భూమి పేరిట ఏకంగా వ్యవసాయ భూమిగా మార్చేస్తున్నారు. ఇలా వివిధ మార్గాల ద్వారా ఆక్రమణకు గురవుతున్న అటవీ భూమిని కాపాడేందుకు అటవీశాఖ అధికారులు శాశ్వత మార్గాలపై దృష్టిపెట్టారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో కాలనీ సమీపంలో ఉన్నట్లు అయితే అధికారులు అటవీ భూమి వరకు ప్రహరీలు నిర్మిస్తున్నారు. పట్టా భూముల సమీపంలో ఉంటే కంచె (ఫెన్సింగ్) వేస్తున్నారు. వ్యవసాయ భూముల సమీపంలో ఉన్నట్లయితే సరిహద్దు పిల్లర్లను నిర్మిస్తున్నారు. అటవీ భూములకు సరిహద్దులు తెలిసేలా ట్రెంచ్ తవ్వుతున్నారు. ఇలా వివిధ మార్గాల ద్వారా అటవీ భూములను కాపాడేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా శాటిలైట్ ద్వారా ప్రతి మూడు నెలలకోసారీ ఫోటోలు సేకరించి భద్రపరుస్తున్నారు. జియోట్యాగింగ్ ను కూడా అమలు చేస్తున్నారు.

ధరల పెరుగుదలతో..

నగరాలు, పట్టణాలకు సమీపంలో ఉన్న అటవీ భూములను కొందరు ఆక్రమించి రియల్ ఎస్టేట్ పరంగా అమ్మేస్తున్నారు. రియల్ ఎస్టేల్ వ్యాపారం తో స్థిరాస్తులకు భారీగా పెరిగిన ధరల కారణంగా అక్రమార్జన లో భాగంగా కొందరు ఈ భూములను ఆక్రమిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అటవీ భూములు ఆక్రమించిన సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రాంతాల్లో కిలోమీటర్ల మేరకు రాతి గోడలు నిర్మించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల్లో కొన్ని కిలోమీటర్ల పొడుగునా ట్రెంచ్ తవ్వించారు.

రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో అటవీ భూములను కాపాడేందుకు అధికారులు ప్రహరీలను నిర్మించారు. సూర్యాపేట జిల్లాలో 12,290 హెక్టార్ల అటవీ భూమికి 3,295 హెక్టార్లు ఆక్రమణకు గురైంది. సంగారెడ్డి జిల్లాలో 20,485 హెక్టార్లకు 4,226 హెక్టార్ల అటవీ ప్రాంతం ఆక్రమణలకు గురైంది. వికారాబాద్ జిల్లాలో 43,944 హెక్టార్ల భూమికి 6,254 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించారు. పోడు భూమి పేరుతో ఆసిఫాబాద్ జిల్లాలో 36,015 హెక్టార్లు, ఆదిలాబాద్ జిల్లాలో 32,315 హెక్టార్లు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో 30,785 హెక్టార్లు చొప్పున అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి.

పోడు వ్యవసాయం పేరుతో..

పోడు వ్యవసాయం పేరుతో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. విస్తీర్ణం పరంగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అటవీ భూముల ఆక్రమణలు అధికంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. అయితే అక్కడ గిరిజనులు ఎక్కువగా పోడు సాగు పేరుతో అటవీ భూముల్ని దశాబ్దాలుగా ఆక్రమిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఒక సారి, మూడేళ్ల క్రితం మరోసారి, ప్రభుత్వం ఆర్వోఎస్ఆర్ పట్టాలు ఇచ్చినా ఇప్పటికీ ఆక్రమణలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులోనూ పట్టాలిస్తారని కొందరు తాజాగా ఆక్రమిస్తున్నారు. అయితే సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో గిరిజనులు చాలా తక్కువ.

పోడు నామమాత్రమే. కానీ ఈ జిల్లాల్లో అటవీ భూములు పలుచోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. ఇక రియల్ ఎస్టేల్ వ్యాపారం పరంగా స్థిరాస్తుల ధరలు అధికంగా ఉండటంతో అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలు, నగరాలు, పట్టణాలకు సమీపంలోనూ అటవీ భూముల ఆక్రమణలు పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో 4,795.65 హెక్టార్ల అటవీ భూములు అన్యాక్రాంతమైనట్లు తేలింది. ఇక్కడి ప్రాంతాల్లో బౌండరీ ఫిల్లర్లు, ట్రెంచ్, ఫెన్సింగ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ భూములు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. ఈ ఆక్రమణలకు స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం ప్రత్యక్షంగానో, పరోక్షంగా ఉంటుందని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Next Story