కుతుబ్ షాహీ టూంబ్స్‌‌‌పై సర్కార్ కీలక నిర్ణయం.. ఆగాఖాన్ ట్రస్ట్‌కు నిర్వహణ బాధ్యతలు?

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌లోని చారిత్రక కుతుబ్ షాహీ టూంబ్స్ నిర్వహణ బాధ్యతలను ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (AKTC) కు అప్పగించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ సిద్ధమవుతోంది.

కుతుబ్ షాహీ టూంబ్స్‌‌‌పై సర్కార్ కీలక నిర్ణయం.. ఆగాఖాన్ ట్రస్ట్‌కు నిర్వహణ బాధ్యతలు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: చారిత్రక కట్టడాల సంరక్షణలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (ఏకేటీసీ) చేతుల్లోకి హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కుతుబ్ షాహీ టూంబ్స్‌ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సంస్థకు ఉన్న అనుభవం నేపథ్యంలో నిర్వహణను దీనికి అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చారిత్రక కట్టాల సంరక్షణలో సంస్థ విశేష కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సమాధుల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు, వీటిని సదరు ట్రస్ట్‌కు అప్పగించాలని రాష్ర్ట పర్యాటక శాఖ యోచిస్తోంది. దీంతో చారిత్రక కట్టాల పర్యవేక్షణ నుంచి పర్యాటక శాఖ పూర్తిగా తప్పుకోనుంది. ఈ మేరకు మూడు నెలల క్రితమే అధికారులు ప్రతిపాదనలను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే రాష్ర్టంలోని పర్యాటక కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా వాటి నుంచి వచ్చే ఆదాయం ప్రభుత్వం కోల్పోతుంది. న్యూ టూరిజం పాలసీ 2025-30లో భాగంగా పర్యాటక కేంద్రాలకు బడ్జెట్ కేటాయించి, పర్యాటకులను ఆకర్షించేలా ప్రచారం చేయడంతో పాటు, కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే ఇది సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. ప్రభుత్వ నిర్ణయంతో ఇక కుతుబ్ షాహీ టూంబ్స్‌ ఆలనాపాలనా అంతా ఆగాఖాన్ చేతుల్లోకి వెళ్లనున్నట్లు సమాచారం.

సిబ్బంది కొరతతో ఇబ్బందులు

కాగా ఎంతో ప్రసిద్ధి చెందిన చారిత్ర వారసత్వ కట్టడం నిర్వహణ కత్తిమీద సాములా మారింది. సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. తక్కువ సిబ్బందితో పర్యాటకులకు అవసరమైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కుతుబ్ షాహీ టూంబ్స్ ప్రాంగణంలో ఏడు ప్రధాన సమాధులు (టూంబ్స్) ఉన్నాయి. అయితే, ఇంతటి విశాలమైన ప్రాంగణాన్ని, చారిత్రక కట్టడాలను నిర్వహించడానికి ప్రస్తుతం కేవలం ఆరుగురు సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో, పర్యాటకుల సందర్శన, మొక్కల సంరక్షణ, కట్టడాల నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ట్రస్ట్‌పై గతంలో హైకోర్టు నోటీసులు

రాష్ట్ర పర్యాటక శాఖపై భారం తగ్గించడమే కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చారిత్రక కట్టడాలను మరింత సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆగాఖాన్ ట్రస్ట్‌కు ఈ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదివరకే హుమయూన్ టూంబ్ వంటి అనేక చారిత్రక కట్టడాలను ఆగాఖాన్ ట్రస్ట్ పునరుద్ధరించిన నేపథ్యంలో, కుతుబ్ షాహీ టూంబ్స్ బాధ్యతలను వారికి అప్పగిస్తే మరిన్ని పర్యాటక వసతులు మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నప్పటికీ, గతంలో ఆగాఖాన్ ట్రస్ట్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం చర్చనీయాంశంగా మారింది. రూ.100 కోట్ల ప్రాజెక్టు కింద కుతుబ్ షాహీ సమాధుల పరిరక్షణ బాధ్యతను ఏకేటీసీకి అప్పగించడంతో, చారిత్రక కట్టడాలను సరిగ్గా పునరుద్ధరించడంలో విఫలమైందని ఆరోపిస్తూ గతంలో ఒక లేఖ ఆధారంగా హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది. సమాధుల పునరుద్ధరణలో నాణ్యత లోపించిందని, మహ్మద్ కులీకుతుబ్ షా సమాధి తీవ్రంగా దెబ్బతిందని పిటిషన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

Next Story