- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగుల డిసిప్లినరీ యాక్షన్ కేసులపై సర్కార్ కీలక నిర్ణయం.. నూతన మార్గదర్శకాలు జారీ
ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణా కేసుల ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణా కేసుల ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. క్రమశిక్షణా చర్యల సమయంలో జాప్యాన్ని నివారించడానికి అన్ని స్థాయిలలోని ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తూ, కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఒక ఉద్యోగి నేరం చేసినట్లుగా గుర్తించిన వెంటనే ప్రాథమిక విచారణను వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో జాప్యం కారణంగా చాలా సందర్భాలలో ఉద్యోగులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఆరోపణలు స్పష్టంగా, సరళమైన భాషలో ఉండాలని సూచించింది. కేవలం విధుల్లో నిర్లక్ష్యం లేదంటే దుష్ప్రవర్తన వంటి సాధారణ పదాలను కాకుండా ఆరోపణలకు తగిన డాక్యుమెంటరీ ఆధారాలు ఉండాలని ఆదేశించింది. సాక్షుల స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని చెప్పింది.
ఆరోపణలను రుజువు చేయడానికి ఉపయోగించే అన్ని పత్రాల నకళ్లను ఉద్యోగికి తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ పత్రాలను నిరాకరించడం న్యాయ సూత్రాలను ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది. అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి నుంచి ప్రతివాదన పత్రాన్ని పొందడం కూడా తప్పనిసరి చేసింది. దీనిని రికార్డులతో సరిపోల్చి సీనియర్ అధికారి పరిశీలించాలని పేర్కొంది. విచారణ నిర్వహించడానికి ప్రిసైడింగ్ అధికారిని నియమించాలని.. ఈ అధికారి కేసు వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని.. డిసిప్లినరీ అథారిటీ తరపున విచారణ అధికారి కేసును వివరాలను అందించాలని సూచించింది. అలాగే.. సాధారణ కేసులను మూడు నెలల్లోపు, క్లిష్టమైన కేసులను ఐదు నుంచి ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పెన్షనరీ ప్రయోజనాలు నిలిచిపోకుండా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కేసులను కూడా ఇదే కాలపరిమితిలో పూర్తి చేయాలని ప్రభుత్వం పేర్కొంది. డిసిప్లినరీ కేసులలో సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ స్థాయిలోని అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని సూచించింది. హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ కూడా రికార్డులను పరిశీలించాలని.. ఉద్యోగుల పదవీ విరమణ తేదీని దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణా చర్యలను పూర్తిచేయాలని ప్రభుత్వం సూచించింది. డిసిప్లినరీ కేసులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు మూడు రోజులకు మించి తమ వద్ద ఉంచుకోకూడదని.. మంత్రుల వద్దకు వెళ్లిన ఫైళ్లను వారం రోజుల్లో క్లియర్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. నిర్దేశిత కాలపరిమితిలో విచారణను పూర్తి చేయడంలో విఫలమైన విచారణ అధికారులు క్రమశిక్షణా చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించింది.






