- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లల రోడ్డు భద్రతకు ప్రభుత్వం బిగ్ స్టెప్.. ‘చైల్డ్ సేఫ్టీ 2030’ యాక్షన్ ప్లాన్ ప్రారంభం
పిల్లలు, యుక్తవయస్కులను రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పిల్లలు, యుక్తవయస్కులను రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ ఫర్ చిల్డ్రన్ 2030పై తొలి రాష్ట్ర స్థాయి సంప్రదింపుల సమావేశం బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. బాలల కేంద్రిత రోడ్డు భద్రత కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం దేశంలోనే తొలి ప్రయత్నాలలో ఒకటిగా నిలిచింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా కమిషనర్ కె. ఇలంబర్తి అధ్యక్షత వహించారు. పీహెచ్ఎఫ్ఐ-ఐపీహెచ్ఎస్ డీమ్డ్ యూనివర్సిటీ, యూనిసెఫ్ సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో రవాణా, పోలీస్, విద్య, వైద్య ఆరోగ్య, మున్సిపల్ పరిపాలన, ఆర్‌అండ్‌బీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఎన్.హెచ్.ఎ.ఐ, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు.
ప్రస్తుతం పిల్లలు, యువతలో మరణాలు, వైకల్యానికి రోడ్డు ప్రమాదాలే ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) గణాంకాల ప్రకారం, 2023లో దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మంది పిల్లలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో 2024లో నమోదైన 7,281 రోడ్డు ప్రమాద మరణాల్లో వందలాది మంది చిన్న పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి రోడ్డు భద్రత దశాబ్ద కార్యాచరణ లక్ష్యాల ప్రకారం రోడ్డు ప్రమాద మరణాలు, గాయాలను 50% తగ్గించడమే ఈ కార్యాచరణ ముఖ్య ఉద్దేశమని వివరించారు.
పిల్లల భద్రతే సమాజ భద్రత..
కార్యక్రమ ప్రాధాన్యతను వివరిస్తూ రవాణా కమిషనర్ కె. ఇలంబర్తి మాట్లాడుతూ.. పిల్లలను దృష్టిలో ఉంచుకొని భద్రతా వ్యవస్థలను నిర్మిస్తే, సమాజమంతటికీ భద్రతను నిర్మించినట్లేనని.. ఒక చిన్నారికి సురక్షితమైన రహదారి ప్రతి పౌరుడికి సురక్షితమని అన్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా సంబంధిత శాఖలతో నిరంతర సంప్రదింపుల ద్వారా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని, రోడ్డు భద్రత పరిపాలనలో తెలంగాణను దేశంలోనే ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. యూనిసెఫ్ ప్రతినిధి డా. జెలలెం బి. టాఫెస్సే, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి. జోయెల్ డేవిస్, యూనిసెఫ్ హెల్త్ స్పెషలిస్ట్ డా. శ్రీధర్ ర్యావంకి, పీహెచ్ఎఫ్ఐ-ఐపీహెచ్ఎస్ వైస్ ఛాన్సలర్ డా. ఎం. విష్ణు వర్ధన్ రావు, రవాణా శాఖ సంయుక్త కమిషనర్లు రమేష్, చంద్ర శేఖర్ గౌడ్, శివలింగయ్య, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పలు ప్రాధాన్యత అంశాలు..
* సురక్షిత పాఠశాల జోన్లు, పాదచారుల కోసం మౌలిక వసతుల కల్పన.
* ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, వేగ నియంత్రణ.
* రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు సవరించడం, బ్లాక్ స్పాట్‌ల తొలగింపు.
* ప్రమాద సమయాల్లో అత్యవసర వైద్య సేవలు అందించడం.
* పాఠశాలలు, సమాజ భాగస్వామ్యంతో అవగాహన సదస్సులు నిర్వహించడం.
* స్పష్టమైన కాలపట్టికలు, సంస్థాగత బాధ్యతలతో కూడిన వ్యవస్థీకృత ప్రక్రియను రవాణా శాఖ త్వరలోనే ప్రారంభించనుంది.






