- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడిగడ్డ పునరుద్ధరణకు సర్కార్ అడుగులు.. పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన ఆ ఐదు సంస్థలు
మేడిగడ్డ పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా ఆ ప్రాజెక్టు వినియోగంలోనూ లేకుండాపోయింది. మేడిగడ్డతోపాటే అన్నారం, సుందిళ్ల నిర్మాణంలోనూ లోపాలు వెలుగుచూశాయి. దాంతో వాటన్నింటికీ మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అయితే.. ఈ బ్యారేజీలపై కేంద్ర సంస్థ అయిన ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ముందుకెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ రిపోర్టు ప్రకారమే రిపేర్లు చేయించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే ఇటీవల బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్లను ఆహ్వానించింది.
ఐదు సంస్థలు బిడ్లు దాఖలు
ఇటీవల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థల నుంచి బిడ్లు ఈవోఐని ఆహ్వానించింది. అయితే.. ఇందుకోసం ఐదు సంస్థలు టెక్నికల్ బిడ్లు దాఖలు చేశాయి. ఈ నెల 25తో ఈ గడువు ముగిసింది. దాంతో అధికారులు వాటిని తెరిచారు. ఇందులో ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ చెన్నయ్, స్పెయిన్‌కు చెందిన సంస్థ కలిపి జాయింట్ వెంచర్‌గా బిడ్ వేశాయి. ఆ తర్వాత నిప్పాన్ సంస్థ కూడా బిడ్ దాఖలు చేసింది. మొత్తం ఐదు సంస్థలు బిడ్లు వేశాయి. దాంతో వాటిని అధికారులు పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేస్తున్నారు. పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ బిడ్లలో కంపెనీల సామర్థ్యం స్టడీ చేసి అర్హత సాధించిన వాటిని సెలక్ట్ చేయనున్నారు. ఆ తరువాత వాటికి ఫైనాన్షియల్ బిడ్ల దాఖలు కోరుతూ టెండర్ నోటీసు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఎన్‌డీఎస్ఏ నివేదిక ప్రకారమే మరమ్మతులు
ఎన్‌డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదిక సూచించిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా డిజైన్లను అందించాలని ఆహ్వానించింది. హైడ్రాలజీ, హైడ్రాలిక్ రివ్యూ, వరదలు, భూకంపాల వంటి విపత్తులను సైతం ఎదుర్కొనేలా బ్యారేజీలోని కీలక విభాగాలను పటిష్టం చేయడానికి డిజైన్లను అందించాలని ఈవోఐలో సూచించింది. దాంతో ప్రభుత్వం విధించిన అన్ని షరతులను అంగీకరిస్తూ ఐదు సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే.. దీనిపై నేడో రేపో అధికారులు ఫైనల్ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారని తెలిసింది. ప్రభుత్వం వైపు నుంచి కూడా అధికారుల జాబితాను పరిగణలోకి తీసుకొని ఆ వెంటనే టెండర్లు ఆహ్వానించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.






