TG Govt.: సర్కారు బడులు హౌస్‌ఫుల్.. దర్శనమిస్తున్న ‘నో అడ్మీషన్’ బోర్డులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-25 01:55:10  IST  )

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు విశేష స్పందన లభిస్తోంది. గతంలో లేని విధంగా ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లలో హవా కనిపిస్తోంది.

TG Govt.: సర్కారు బడులు హౌస్‌ఫుల్.. దర్శనమిస్తున్న ‘నో అడ్మీషన్’ బోర్డులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు విశేష స్పందన లభిస్తోంది. గతంలో లేని విధంగా ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లలో హవా కనిపిస్తోంది. ఇటీవల సర్కారు స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, బడిబాట, ఇంగ్లిష్ విద్యాబోధన వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉపాధ్యాయులు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, విద్యాబోధనలో నాణ్యతను పెంచడానికి చేపట్టిన పలు కార్యక్రమాలు, ఉపాధ్యాయుల కృషి అందుకు కారణమయ్యాయి. గత సంవత్సరం జూన్ 24 నాటికి 2,00,901 అడ్మిషన్లు నమోదుకాగా, ఈ ఏడాది జూన్ 24 నాటికి ఈ సంఖ్య 2,56,156కు చేరడం గమనార్హం. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అడ్మిషన్లు జోరందుకున్నాయి. స్కూళ్లు ప్రారంభమైన రెండు వారాలకే రెండు లక్షలకు పైగా అడ్మిషన్లు వచ్చాయి. కొత్త విద్యార్థులు ఎక్కువగా 1వ తరగతిలోనే చేరుతున్నారు. అయితే ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రభుత్వం పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపునకు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.

అడ్మిషన్లు ఇలా..

ఈ ఏడాది 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి జూన్ 24 నాటికి ప్రభుత్వ స్కూళ్లలో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు మొత్తం 1,07,126 నమోదయ్యాయి. 2 నుంచి 10 వ తరగతి వరకు అడ్మిషన్లలో ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూలులో 48,133 మంది విద్యార్థులు చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ క్లాసుల్లో కలిపి మొత్తం 1,00,897 అడ్మిషన్లు అయ్యాయి. దీంతో విద్యార్థుల చేరికల సంఖ్య 2,56,156కు చేరింది.

వినూత్న ప్రచారాలతో సత్ఫలితాలు

సర్కారు బడుల్లో అందుతున్న సౌకర్యాలపై ఉపాధ్యాయులు, అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టారు. ఆయా పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తామని ఉపాధ్యాయులు కరపత్రాలతో పాటు పలు రకాల ప్రచారం చేస్తూ విద్యార్థులను పాఠశాలలకు రప్పించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం ఏటా ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చు చేస్తూ ఉండటంతో పాటు సకల సదుపాయాలు కల్పించడం, యూనిఫాం అందజేత, పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం, పాఠ్య, రాత పుస్తకాలు అందిస్తున్నామని ప్రచారం చేశారు. మీ పిల్లలకు చదువు రాకుంటే నిలదీయండి అని టీచర్లు చేసిన ప్రచారం విద్యార్థుల తల్లిదండ్రులను బాగా ఆకట్టుకున్నది. అలాగే చాలా ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు. ఇదిలాఉండగా, ప్రైవేట్ పాఠశాలల్లో అర్హతలు లేని టీచర్లు ఎక్కువగా ఉంటారని వివరించడం, ఫీజులు తల్లిదండ్రుల స్థోమతకు మించి ఉండటం ప్రభుత్వ పాఠశాలలకు మరింత కలిసొచ్చే అంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత చదువుల్లో కూడా రిజర్వేషన్‌ వర్తించడం వంటి విషయాలను తల్లిదండ్రులకు బాగా వివరించగలిగారు.

Next Story