సర్కార్ సాండ్ బజార్లు వెలవెల.. కన్నెత్తి చూడని బిల్డర్లు

by Kema Shiva Kumar |

ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాండ్ బజార్లకు అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదు.

సర్కార్ సాండ్ బజార్లు వెలవెల.. కన్నెత్తి చూడని బిల్డర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాండ్ బజార్లకు అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదు. అప్పుడప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు ఇక్కడ ఇసుక కొనుగోలు చేస్తున్నా.. బడా బిల్డర్లు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండేలా నగరానికి నాలుగు వైపులా ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది. దొడ్డు ఇసుకకు రూ. 1600, సన్న ఇసుకకు రూ.1800లు ధర నిర్ణయించింది. దీంతో పెద్ద సంఖ్యలో నిర్మాణదారులు వచ్చి ఇసుక కొనుగోలు చేస్తారని భావించింది. అయితే రోజుకు లక్షలాది లారీల ఇసుకను వినియోగించే బడా బిల్డర్లు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎప్పటి మాదిరిగానే మధ్య దళారుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అదనంగా రూ. 400 పెట్టి సరఫరా చేయించుకుంటున్నారు. దీంతో మూడు నెలలుగా ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. తక్కువ ధరకే ఇసుక అందుబాటులో ఉంచినా.. ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ప్రచార లోపమా, మాఫియాకు అంతర్గతంగా సహకరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక బజార్లలో అమ్మకాలు పెరిగేలా ఏం చేయాలనే అంశాలపై పరిశీలిస్తున్నట్టు మైనింగ్ శాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు.

తాపీమేస్త్రీల ప్రభావం!

మాఫియా ఇచ్చే కమిషన్లకు అలవాటు పడ్డ తాపీ మేస్త్రీలు.. బజార్ల ఇసుక బాగా లేదని ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తున్నది. నిర్మాణదారులు నేరుగా ఇసుక కొనుగోలు చేస్తే తమకు ఇతరత్రా డబ్బులు దొరకవని, దళారులు వద్ద తెస్తే టన్నుకు రూ. 50 చొప్పున అదనంగా ఆదాయం వస్తుందని భావించి.. వారు చెప్పినవారి దగ్గరి నుంచే ఇసుక తీసుకొస్తేనే పనులు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక తీసుకురావద్దని తాపీ మేస్త్రీలు అంటున్నారని ఇండ్ల యజమానులే చెబుతుండడం గమనార్హం.

డీసీఎంలు, ట్రాక్టర్లు మాత్రమే..

ఇసుక బజార్ల వద్ద ఇప్పటి వరకు 16, 20 టైర్ల లారీ కొనుగోలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. పది టన్నుల్లోపు వాహనాలైన డీసీఎం, ట్రాక్టర్లు మాత్రమే ఇసుకను కొనుగోలు చేస్తున్నాయి. వీరంతా మధ్యలో నిలిచిపోయిన నిర్మాణం, 120 గజాల లోపు వారికే ఇసుక సరఫరా చేస్తున్నారు. బడా నిర్మాణ దారులు మాత్రం దళారుల మాయలో పడి ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి.

రీచ్‌ల వద్ద తవ్వకాలు నిలివేయాలి

ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలుగుల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారం, సుబ్బంపేట, వీరాపురం, గొల్లగూడ, చింతకుంట, ములుగులోని ధర్మవరం, మల్లూరు, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల నుంచి కోర్ సాండ్, ఫైన్ సాండ్ ఇసుక తవ్వకాలు చేస్తున్నది. ఈ క్వారీల్లో వారం రోజుల పాటు ఇసుక తవ్వకాలు నిలిపివేస్తే నిర్మాణదారులంతా ఇసుక బజార్లకు బారులు కడతారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసే అలవాటు పడితే.. తక్కువకు లభిస్తుందని పూర్తి స్థాయిలో ఇక్కడే తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. తూతూ మంత్రంగా బజార్లు నడిపించాలనుకుంటే.. కొనుగోలుదారులు రాక ఏడాదిలోపు ఇసుక బజార్లు మూసివేసే పరిస్థితి వస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story