పేద ప్రజలకు అండగా ప్రభుత్వ పాలన..

by Elthuri vijay kumar |

పేద ప్రజలకు అండగా ప్రభుత్వ పాలన..
X

పేద ప్రజలకు అండగా ప్రభుత్వ పాలన..

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

దిశ, నేలకొండపల్లి : పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.బుధవారం నేలకొండపల్లి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, నేలకొండపల్లి మండల కేంద్రం ప్రధాన రహదారి సెంట్రల్ లైటింగ్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.నేలకొండపల్లి మండలం నందిగామ బ్రాంచ్ కెనాల్ 16 నుంచి అజయ్ తండా వరకు 4 కోట్ల 50 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణం, రాజేశ్వరపురం గ్రామంలో 20 లక్షలతో, మోటాపురం గ్రామంలో 15 లక్షలతో, కొత్త కొత్తూరు గ్రామంలో 15 లక్షలతో చేపట్టిన అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల కుప్పగా తయారు చేశారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో వెనక్కి తగ్గడం లేదని అన్నారు. ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా సహాయం 12 వేలకు పెంపు, సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ, పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు నమోదు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.సన్న వడ్లు పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. 25 లక్షల రైతులకు 21 వేల కోట్ల రూపాయలతో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేసామని అన్నారు. 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో రైతు భరోసా క్రింద జమ చేయడం జరిగిందని అన్నారు.

గత ప్రభుత్వం పేదలకు సొంతిల్లు అందించే పథకం నిర్లక్ష్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం 22 వేల 500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రతి సోమవారం డబ్బులు విడుదల చేస్తున్నామని అన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో మూడు విడతల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని అన్నారు.కొత్తకొత్తూరు గ్రామంలో నేలకొండపల్లి మండలానికి సంబంధించి కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ లబ్ధిదారులకు మంత్రి చెక్కుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి,పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఇఇ వాణిశ్రీ, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story