- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ బంకుల వద్ద రద్దీపై ప్రభుత్వం అలర్ట్.. 3100 ట్యాంకర్లు రంగంలోకి
పెట్రోల్ బంకుల వద్ద రద్దీపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా సకాలంలో పంపిణీ జరిగేలా తెలంగాణ పౌరసరఫరాల శాఖ చమురు సరఫరాను 126 శాతం పెంచింది.

దిశ, తెలంగాణ బ్యూరో : పెట్రోల్ బంకుల వద్ద రద్దీపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా సకాలంలో పంపిణీ జరిగేలా తెలంగాణ పౌరసరఫరాల శాఖ చమురు సరఫరాను 126 శాతం పెంచింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్‌తో స్థానిక పెట్రోల్ బంకుల్లో తలెత్తిన రద్దీని తగ్గించడానికి అధికారులు వేగవంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో పేర్కొంటూ.. పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ పెరగడానికి మూడు కారణాలు ఉన్నాయని తెలిపారు. పరిశ్రమలకు వాడే డీజిల్ ధరను ఇటీవల లీటరుకు రూ. 150 కు పెంచడంతో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వ్యాపారులు, లీటరు రూ. 95 కే దొరుకుతున్న సాధారణ పబ్లిక్ పెట్రోల్ బంకులకు వచ్చి డీజిల్ కొంటున్నారని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో సరఫరా సమస్యలు ఉన్నాయని, దీంతో పక్క రాష్ట్రాల ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం ఖమ్మం, నిర్మల్ లాంటి తెలంగాణ సరిహద్దు జిల్లాలకు క్యూ కడుతున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే తప్పుడు ప్రచారంతో సాధారణ ప్రజలు భయపడి, అవసరానికి మించి కొని దాచుకోవడంతో స్థానికంగా ఉన్న నిల్వలు వేగంగా అయిపోతున్నాయని వెల్లడించారు.
మార్కెట్లో సరిపడా నిల్వలు
ప్రజలకు సమస్యలు రాకుండా పెట్రోల్, డీజిల్ కంపెనీలకు మార్కెట్లో సరిపడా నిల్వలు ఉంచాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సరఫరాను వేగవంతం చేయడానికి, డీలర్ల నుంచి ముందుగానే ఆర్డర్లు తీసుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా 3100 ఇంధన వాహనాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల్లో నిల్వలు పూర్తిపోకముందే వాటికి ఇంధనం చేరేలా అధికారులు పర్యవేక్షణ పెంచారు. ప్రతి మూడు గంటలకోసారి బంకుల నుంచి నిల్వల వివరాలు తెప్పించుకోవడంతో పాటు, ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడాలని కఠిన ఆదేశాలు ఇచ్చినట్లు తద్వారా పంట కోతలు, ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకం జరగదన్నారు. ఏప్రిల్ 27 నాటికి, రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ డీజిల్ పంపిణీ 151 శాతం పెరిగి 7,348 కిలో లీటర్ల నుంచి 18,449 కిలో లీటర్లకు పెరిగిందని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పెట్రోల్ పంపిణీ కూడా దాదాపు రెట్టింపు అయ్యిందని, 95 శాతం పెరిగి 5,883 కిలో లీటర్ల నుంచి 11,490 కిలో లీటర్లకు చేరుకుందని వివరించారు.
రాజధాని ప్రాంతంలో ఎలాంటి కొరత రాకుండా చూడటానికి, హైదరాబాద్‌లో ఇంధన సరఫరాను 43 శాతం పెంచినట్లు తెలిపారు. నగరంలో డీజిల్ నిల్వలను 46 శాతం, పెట్రోల్ నిల్వలను 40 శాతం పెంచినట్లు వెల్లడించారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని పౌరసరఫరాల శాఖ ప్రజలకు హామీ ఇస్తుంది. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ఎప్పటిలాగే తమకు అవసరమైన మేరకే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని సూచించారు. ప్రజల, రైతుల అవసరాలకు సరిపడా నిల్వలు పెట్రోల్ బంకుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయన్నారు.






