- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఔట్‌సోర్సింగ్’ పేరుతో సర్కార్ సొమ్ము లూఠీ.. ఏజెన్సీలు, అధికారుల కుమ్మక్కు
రాష్ట్ర ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ సేవల పేరుతో భారీ స్కాం వెలుగుచూసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ సేవల పేరుతో భారీ స్కాం వెలుగుచూసింది. ఒకే వ్యక్తి నాలుగైదు చోట్ల పనిచేస్తున్నట్టు రికార్డుల్లో చూపి ప్రతి ఏటా రూ.వందల కోట్లు కొల్లగొట్టి వాటాలుగా పంచుకున్నారు. ఏజెన్సీలు, అధికారులు కుమ్మక్కై ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. కొన్ని ఏండ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఎవరూ గుర్తించలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద జరిగిన ఓ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో అలాంటి వారు ఎంత మంది పనిచేస్తున్నారో లెక్కలు తీయాలని సీఎం ఆదేశించారు. దీంతో గ్రామ స్థాయి నుంచి మొదలుకుని, రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్న వారి సంఖ్య, వారికి చెల్లిస్తున్న జీతాల వివరాలను ఫైనాన్స్ శాఖ సేకరించింది.
సగం, సగం వాటాలు
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు, హెచ్ఓడీల్లో పనిచేస్తున్న అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కుమ్మక్కై ఈ స్కామ్ చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. బినామీలు, డబుల్ పేర్లతో ఉన్న ఎంప్లాయీస్‌కు చెల్లించే జీతాల్లో కొంత మొత్తాన్ని వారికి చెల్లించి, మిగతా డబ్బును అధికారులు, ఏజెన్సీలు సమానంగా పంచుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక శాఖలో ఎంత మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అవసరమో చెబుతూ ఆ శాఖలోని హెచ్ఓడీ అనుమతి ఇవ్వాలి. ఆ మేరకే టెండర్లు పిలిచి ఏజెన్సీలను ఎంపిక చేస్తారు. ఆ ఏజెన్సీలకు ప్రతి నెలా ప్రభుత్వం వేతనాలు చె ల్లిస్తుంది. అందులో ప్రతి ఉద్యోగి నుంచీ కొంత కమీషన్ తీసుకుని, మిగతా డబ్బులను ఎంప్లా యీస్‌కు ఏజెన్సీలు చెల్లిస్తాయి. ఈ ప్రక్రియలో ఆ శాఖలోని అధికారులు, ఏజెన్సీల మధ్య పరస్పర సహాయ సహకారాలు అవసరం. కొన్ని చోట్ల పెద్ద ఆఫీసర్ల ఇంట్లో పనిచేస్తున్న వారికి సైతం అవుట్ సోర్సింగ్ ఖాతాల నుంచే జీతాలు చెల్లిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇంతకాలం ఎక్కడాఈ విషయం బయటకు పొక్కకుండా సాఫీగా జరిగిపోయింది.
సమాచారం ఇవ్వని హోంశాఖ
అవుట్ సోర్సింగ్ సేవల డేటాను అన్ని శాఖలు ఇచ్చినా ఇప్పటివరకు హోం శాఖ మాత్రం నివేదిక ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయంపై ఇప్పటికే పలుసార్లు డీజీపీకి లేఖ రాసినా స్పందించడం లేదని తెలిసింది. చాలా మంది పోలీసు బాసులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్టేషన్లు, హెడ్ ఆఫీసుల్లో పని చేస్తున్నారని చెబుతూ.. వాళ్లతో సొంత పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే హోంశాఖ నుంచి ఇంతవరకు పూర్తి డేటా రాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సెక్రెటేరియట్‌లో సైతం..
సెక్రెటేరియట్‌లో సుమారు వెయ్యి మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో సుమారు 50 నుంచి 60 మంది సెక్రెటేరియట్‌లో కనిపించడం లేదని వారంతా ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఆఫీసర్ల ఇండ్లల్లో పనిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. జీఏడీలోని ఓ ఐఏఎస్ అధికారి ఇంట్లో నలుగురు పని మనుషులకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే జీఏడీలోని ఓ సీనియర్ ఆఫీసర్ ఇంట్లో పనిమనుషులకు, బంధువుల అకౌంట్స్‌లోకి సెక్రెటేరియట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జీతాలు వెళ్తున్నట్టు టాక్.
ఆధార్ నంబర్‌తో గుట్టురట్టు
అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలకు ఫైనాన్స్ శాఖ సర్క్యులర్ పంపింది. అందులో ప్రతీ ఎంప్లాయ్ పనిచేస్తున్న ప్రాంతం, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొంది. దీంతో అన్ని శాఖలు తమ దగ్గర ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను పంపించాయి. ప్రభుత్వం వద్ద ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఉంది. అందులో ఆధార్ నంబర్ ఎంట్రీ చేస్తే 360 డిగ్రీలో ఆ ఆధార్ నంబర్ ఉన్న వ్యక్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, స్థిర, చర ఆస్తుల వివరాలు తెలిసిపోతాయి. ఇందులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్ నంబర్లను ఎంట్రీ చేయగానే ఒకే ఆధార్ నంబర్‌తో ఉన్న వ్యక్తులు నాలుగైదు చోట్ల పనిచేస్తున్నట్టు వివరాలు వచ్చాయి. కొన్ని శాఖలు ఇచ్చిన వివరాలు తనిఖీ చేయగా, అందులో స్థానిక పొలిటికల్ లీడర్లు, ప్రయివేటు ఎంప్లాయీస్, గృహిణులు ఉన్నట్టు గుర్తించారు. వీరందరికీ ప్రతినెలా అవుట్ సోర్సింగ్ ఎజెన్సీల నుంచి జీతాలు పడుతున్నట్టు తేల్చారు.
ప్రతి ఏటా రూ.160 కోట్లు మింగిండ్రు
ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో సుమారు 1.27 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందుకు ప్రభుత్వం ప్రతి ఏటా రూ.1200 కోట్లు జీతాల రూపంలో చెల్లిస్తున్నది. అందులో బినామీ, డబుల్ పేర్లతో ప్రతి ఏటా దాదాపు రూ.160 కోట్లు మింగేస్తున్నట్టు ఫైనాన్స్ శాఖ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. అన్ని శాఖల్లోనూ ఈ దందా కొనసాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మున్సిపల్, హెల్త్ శాఖల్లో పెద్ద ఎత్తున అవుట్ సోర్సింగ్ సేవల పేర్లలో అవినీతి జరిగినట్టు గుర్తించారు. మున్సిపల్ శాఖలో ప్రధానంగా జీహెచ్ఎంసీలో దాదాపు 4 వేల మంది బీనామీలు, డబుల్ పేర్లతో ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్నట్టు ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రస్తావించినట్టు తెలుస్తున్నది.
అలాగే హెల్త్ డిపార్ట్ మెంట్‌లో డబుల్ పేర్లు, బినామీల పేర్లతో సుమారు 6వేల మందికి జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని గుర్తించినట్టు సమాచారం. అవుట్ సోర్సింగ్ సేవల పేరుతో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో ఈ మధ్య ప్రభుత్వం అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అందులో మాజీ సీఎస్ శాంతికుమారి, రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు ఉన్నారు. మంజూరైన పోస్టులు, వాటి కొనసాగింపు, కొత్త ఆంక్షలు, సూచనలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంశంపై శాఖా కార్యదర్శులు, విభాగాల అధిపతులతో సంప్రదించి రిపోర్టు ఇచ్చేందుకు కమిటీ ఈ మధ్య తొలి సమావేశం నిర్వహించింది.
18 వేల మంది బినామీలే: ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌లోని ఓ సీనియర్ అధికారి
అన్ని శాఖల నుంచి వచ్చిన వివరాలను ఆధార్ నంబర్ ద్వారా పరిశీలిస్తే అసలు విషయం బయటకు వస్తుంది. దాదాపు 18 వేల మందికి పనిచేయకుండానే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నది. దీన్ని కట్టడి చేయగలిగితే ప్రతి ఏటా ప్రభుత్వానికి రూ.150 కోట్ల నుంచి రూ.160 కోట్ల వరకు ఆదా అవుతుంది.






