దీపావళి తర్వాత పత్తి కొనుగోళ్లు.. ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం

by Malleboina Mahesh |

రాష్ట్రంలో పత్తి రైతులకు శుభవార్త. నవంబర్ నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున దీపావళి తర్వాత కొనాలని చేయాలని భావిస్తోంది.

దీపావళి తర్వాత పత్తి కొనుగోళ్లు.. ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పత్తి రైతులకు శుభవార్త. నవంబర్ నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున దీపావళి తర్వాత కొనాలని చేయాలని భావిస్తోంది. దళారుల ప్రమేయం లేకుండా సక్రమంగా సాగేలా చర్యలు చేపట్టనుంది. గతేడాది కంటే ఈసారి ముందుగానే కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, సుమారు 24.7 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవల సీసీఐ వేసిన టెండర్లకు 342 జన్నింగ్​మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేశారు. నవంబర్​మొదటి వారంలో ఆయా కేంద్రాల్లో పత్తిని కొనేలా మార్కెటింగ్​శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.

గతేడాది రైతుల కంటే ఎక్కువ దళారులే పత్తి విక్రయాలు చేసినట్లు గుర్తించారు. కానీ ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా ‘కపాస్ ​కిసాన్ యాప్’​ను ప్రభుత్వం తీసుకొచ్చింది. పత్తిని అమ్ముకోవాలనుకునే రైతులు ఆన్​లైన్​ద్వారా యాప్​లో స్లాట్​బుక్​చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రాలకు పత్తిని వారం రోజుల లోపు తరలించాలి. ఆలస్యం చేస్తే స్లాట్​రద్దవుతుంది. యాప్​గురించి రైతులకు తెలిసేందుకు వ్యవసాయశాఖ అధికారులు ఊరురా అవగాహన సదస్సులు నిర్వహించాలని భావిస్తున్నది. నేరుగా రైతులు ఆన్​లైన్​కేంద్రాలకు పట్టాదారు పాస్ ​పుస్తకంతో వెళ్లి తద్వారా వివరాలు నమోదు చేసుకునేలా యాప్​ను రూపొందించారు. రైతులు దళారులకు పాస్​బుక్​లు ఇస్తే చర్యలు తప్పని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

దళారులకు అడ్డుకట్ట

ఈ సారి కొత్తగా తీసుకొస్తున్న కిసాన్ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానం తో రైతులకు మేలు జరగనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ యాప్ ద్వారా మధ్యవర్తులు, దళారుల దోపిడీకి చెక్ పడనుంది. నేరుగా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పంటను విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్లాట్ బుకింగ్ విధానంపై వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి మార్కెట్ యార్డులో కల్పించాల్సిన వసతులపై దిశానిర్దేశం చేశారు. గతంలో కొందరు వ్యాపారులు, దళారులు అధికారులతో కుమ్మక్కై ఇతర రైతుల పేరుతో సీసీఐకి పత్తిని విక్రయించారు.

దీంతో కొంత మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. రైతుల స్లాట్ బుకింగ్ ద్వారా ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతం కాకూడదని సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పత్తితీత పనుల కొంత ఆలస్యమయ్యాయి. దీపావళి ముగిసిన తర్వాతే పత్తి కొనుగోళ్లు చేస్తామని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. కౌలు రైతులు కూడా ఓటీపీ ఆధారంగా నమోదుకు వీలు కల్పించారు. వారి వివరాలు సంబంధిత పట్టాదారు ధ్రువీకరించిన తర్వాతే ఆమోదం పొందనున్నారు.

మానిటరింగ్​ కమిటీల పర్యవేక్షణ

పత్తి కొనుగోళ్లు సక్రమంగా సాగేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో స్థానిక మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ కమిటీలు తేమ శాతం, నాణ్యత, తూకం, ధరల విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా సూచనలు, సలహాలు ఇవ్వనుంది. రైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5779, వాట్సాప్ హెల్ప్‌లైన్ 88972 81111 కేటాయించారు. ప్రతి కొనుగోలు కేంద్రం, జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.

రోజువారీ క్రయ విక్రయాలను పరిశీలించేందుకు డైరెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూం సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. గోదాంల నుంచి మిల్లులకు పత్తి రవాణాలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పత్తి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా, వేగంగా కొనుగోళ్లు జరగనున్నాయి. సీసీఐ, మార్కెటింగ్ శాఖ, జిల్లా కలెక్టర్లు, రైతు సంఘాలు సమన్వయంతో పని చేయనున్నాయి. పత్తి ధర క్వింటాలుకు మార్కెట్లో రూ.6,700 ఉంది. అంత కంటే తక్కువ ధరకు విక్రయాలు జరగకుండా అధికారులు అప్రమత్తం చేశారు. ఫిర్యాదుల వస్తే వెంటనే తనిఖీలు చేయనున్నారు.

Next Story