Nalini: నళిని ఆరోగ్యంపై ప్రభుత్వం ఆరా.. సీఎం ఆదేశాలతో కలెక్టర్ పరామర్శ

by Prasad Jukanti |   (  Updated:2025-09-22 13:09:23  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాజీ డీఎస్పీ నళినిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పరామర్శించారు.

Nalini: నళిని ఆరోగ్యంపై ప్రభుత్వం ఆరా.. సీఎం  ఆదేశాలతో కలెక్టర్ పరామర్శ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళినికి (Former DSP Nalini) సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు (Yadadri Bhuvanagiri District Collector Hanumanth Rao) అన్నారు. ఇదే నా మరణ వాంగ్మూలం అంటూ ఇటీవల నళిని బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ కలెక్టర్ హనుమంతరావు నళినితో పాటు ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా సర్వీసు ఇష్యూలు ఏం ఉన్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం సందేశాన్ని నళినికి కలెక్టర్ తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హనుమంతరావు.. సీఎం ఆదేశాలతో నళిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశామన్నారు. అవసరం అయితే హైదరాబాద్ నిమ్స్, లేదా ఇతర కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎంత ఖర్చైనా ప్రభుత్వం తరఫున వైద్య సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని సీఎం చెప్పారని వెల్లడించారు. గతంలో ఆమె వైద్యం కోసం ఏదైనా ఖర్చులు అయి ఉంటే వాటిని సైతం సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెల్లిస్తామని సీఎం చెప్పారని ఈ విషయాలను నళిని దృష్టికి తీసుకువెళ్లామన్నారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారని కానీ యోగా, ఆయుర్వేదం వల్ల ప్రస్తుతం ఆణె ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. తన సర్వీస్ నిబంధనల గురించి నళిని తమతో చెప్పారని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

Next Story