మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి

by Ramesh Naini |

రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మైనార్టీ సంక్షేమం, అభివృద్ధి పనులపై సచివాలయంలో గురువారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించామని, ఆ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ సంస్కృతిని ప్రతిబింబించేలా పెద్ద ఎత్తున 'ముషాయిరా' (కవి సమ్మేళనాలు) నిర్వహించనున్నట్లు భట్టి వెల్లడించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రస్తుతం 20 పాఠశాలల నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండగా, మరో 17 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. అసంపూర్తిగా ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత..

మైనార్టీ యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించేందుకు 'రాజీవ్ యువ వికాసం' పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. క్రిస్టియన్, మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులను వారి ఆర్థిక ప్రోత్సాహకాలకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. వక్ఫ్ బోర్డుకు చెందిన విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా చట్టపరమైన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్మశాన వాటికల ఏర్పాటుకు తక్షణమే స్థలాలను సేకరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. మైనార్టీ స్మశాన వాటికల చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న మొహర్రం వేడుకల్లో భాగంగా, 9వ రోజు జరిగే ప్రత్యేక కార్యక్రమానికి హాజరు కావాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈ సమావేశంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story