ఫ్యాన్సీ నంబర్ల రిజర్వేషన్ ఫీజులు భారీగా పెంచిన సర్కారు

by Malleboina Mahesh |

వాహనాలు ఉన్న వారికి ఫ్యాన్సీ నంబర్లపై ఎంతో మోజు. ఎలాగైనా తమ కారుకు ఆకర్షణీయమైన నంబర్ ప్లేట్ బిగించుకోవాలని ఉబలాటపడే వాహనదారులు ఎందరో.

ఫ్యాన్సీ నంబర్ల రిజర్వేషన్ ఫీజులు భారీగా పెంచిన సర్కారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వాహనాలు ఉన్న వారికి ఫ్యాన్సీ నంబర్లపై ఎంతో మోజు. ఎలాగైనా తమ కారుకు ఆకర్షణీయమైన నంబర్ ప్లేట్ బిగించుకోవాలని ఉబలాటపడే వాహనదారులు ఎందరో. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాహనాల ప్రత్యేక నంబర్ల రిజర్వేషన్ ఫీజులను పెంచుతూ శనివారం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. మోటార్ వెహికిల్స్ రూల్స్-1989లోని రూల్ 81కు సవరణలు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్ నెం.77 ప్రకారం, కొత్త ఫీజులు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఫ్యాన్సీ నంబర్ల రిజర్వేషన్ ఫీజుల పెంపునకు జీవో సవరణపై ఈ ఏడాది ఆగస్టు 16న విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌కు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో, ప్రభుత్వం ఇప్పుడు తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్యాన్సీ నంబర్ల కోసం దరఖాస్తు ఛార్జీలను పెంచుతూ తీసుకువచ్చిన ఈ జీవో వల్ల రవాణాశాఖకు ఆదాయం పెరిగేందుకు అవకాశం ఏర్పడనుంది.

గతంలో రూ. 50 వేలు ఉన్న ఫ్యాన్సీ నంబర్ ఇప్పుడు రూ.లక్షా 50 వేలకు పెంచేశారు. ఇకపై ఓ మోస్తరు ఫ్యాన్సీ నంబర్ కావాలన్నా వేలకు వేలు చెల్లించుకోవాల్సిందే. అయితే ప్రభుత్వం ఫ్యాన్సీ నంబర్ల ధరలు పెంచేందుకు సిద్ధమైన... సాధారణ నంబర్లకు కూడా భారీగా ధరలు పెంచేందుకు నిర్ణయించడంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఫ్యాన్సీ అంటే 9999, 6666, 3333, 1, 3, 9 లాంటి నంబర్లు మాత్రమే అని భావించేవారు. అందుకే వాటికే ఎప్పటి నుంచో భారీ డిమాండ్ ఉంటోంది. 6669, 9996, 3339, 4445 వంటి నంబర్లకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. అందుకే వీటిని చాలా తక్కువ ధరతో సొంతం చేసుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ సాధారణ నంబర్లకు కూడా భారీగానే ధరలు నిర్ణయించారు.

ఇప్పుడు పెరిగిన ధరలు ఇలా..

కొత్తగా తీసుకొచ్చిన ధరల పట్టిక చూస్తే కళ్లు తిరుగుతాయి. అయితే ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడే ధనవంతులను చూస్తే పోనీలే బాగానే పెంచారు అని అందరూ అంటున్నా.. సామాన్యులకు కూడా కాస్తో కూస్తో ఉన్న ఫ్యాన్సీ నంబర్ల చివరి శ్రేణిని కూడా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని వాపోతున్నారు. గతంలో ప్రారంభ ఛార్జీనే రూ.50వేలు ఉంటే ఆ స్థానంలో మోస్ట్ ఫ్యాన్సీ నంబర్ 9999 కోసం రూ.లక్ష 50 వేలు, 1, 9, 6666 వంటి ప్రత్యేక సంఖ్యలకు రూ.లక్ష అంటూ రెండు కొత్త స్లాబులను తీసుకువచ్చారు. వీటితో పాటు 99, 999, 3333, 4444 వంటి నంబర్లకు రూ.50వేలు గా నిర్ణయించారు. ఒకే నంబర్ కోసం అనేక దరఖాస్తులు వచ్చిన సందర్భంలో బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అత్యధిక మొత్తం నమోదైన దరఖాస్తుదారుడికి కేటాయిస్తారు.

ఫ్యాన్సీ రిజర్వేషన్ కోసం నిబంధనలు ఇవే..

ఫ్యాన్సీ నంబర్ల కోసం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే నంబర్‌కు ఎక్కువ దరఖాస్తులు వస్తే మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ఆన్‌లైన్ బిడ్డింగ్ జరుగుతుంది. బిడ్‌లో పాల్గొనని వారి ఫీజులు రద్దవుతాయి. ఓడిపోయిన బిడ్డర్లకు రిజర్వేషన్ ఫీజులో 10 శాతం మినహాయించుకుని మిగతా డిపాజిట్ చెల్లిస్తారు. వా హనం 15 రోజుల్లోగా రిజిస్ట్రేషన్‌కు తీసుకురాకపో తే రిజర్వేషన్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. నంబర్‌ ను తిరిగి బిడ్డింగ్ కోసం పోర్టల్ లో ఉంచుతారు.

గతంలో ఫ్యాన్సీ... ఇలా ఉండేది..

2006లో జీవో నం.175 ప్రకారం ప్రస్తుతం ఫ్యాన్సీ ధరలు నడుస్తున్నాయి. రూ. 50 వేలకు అత్యంత ఫ్యాన్సీ నంబర్లున 1, 9, 999, 9999 వంటి నంబర్లను దక్కించుకునేందుకు అవకాశం ఉండేది. ఇక రూ.30వేలు చెల్లించి 99, 333, 555, 666, 777, 888, 2222, 3333, 4444, 5555, 6666, 7777, 8888 తరహా నంబర్లు... రూ. 20 వేలు చెల్లిస్తే 123, 222, 369, 444, 567, 786, 1111, 3366, 3456, 4455 వంటి నంబర్లు లభించేవి. ఇక రూ.10 వేలు చెల్లిస్తే 3, 5, 6, 7, 111, 234, 306, 405, 789, 818, 909, 1188, 1234, 1314, 1818, 1899, 2277, 2772, 2345, 2727, 2799, 3636 తరహా నంబర్లు ఇచ్చేవారు. రూ.5 వేలు చెల్లిస్తే కార్లకు ఇతర నంబర్లు కేటాయించేవారు. ఇక బైక్‌ల విషయానికి వస్తే రూ.2వేలు చెల్లించి ఫ్యాన్సీ నంబర్లలో చివరి వరుసలో ఉండే వాటిని తీసుకునేందుకు ఛాన్స్ ఉండేది.

పెద్దగా డిమాండ్ లేని నంబర్లకూ రూ.40వేలు

1234, 8888, 6789 తదితర నంబర్లకు రూ.40 వేల వరకు వసూలు చేసేందుకు నిర్ణయించడం మధ్యతరగతి వాహనదారులకు రుచించడం లేదు. గతంలో వీటికి రూ.20 వేలుండేది. అలాగే సాధారణ సంఖ్యలకు అంటూ మరో స్లాబ్ రూ.6 వేలుగా నిర్ణయించారు. ఇందులో టూ వీలర్లకు రూ.3వేలుగా పేర్కొన్నారు. ఇతర ప్రత్యేక సంఖ్యలకు రూ. 40వేలు వసూలు చేయడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఇక ఫ్యాన్సీ నంబర్ల ఆలోచనే చేయబోరని రవాణా శాఖకు చెందిన ఓ అధికారి వాపోయారు. ధనవంతులకే ఫ్యాన్సీ నంబర్లా... సాధారణ ప్రజలకు మోస్ట్ ఫ్యాన్సీ నంబర్ కాకున్నా ఓ మోస్తరు ఫ్యాన్సీ నంబర్ అయినా అందకుండా చేస్తారా అని వాహనదారులు మండిపడుతున్నారు.

Next Story