TSPSC పేపర్ లీక్ వ్యవహారం వెనుక ప్రభుత్వ హస్తం: ABVP

by Disha Web Desk 19 |
TSPSC పేపర్ లీక్ వ్యవహారం వెనుక ప్రభుత్వ హస్తం: ABVP
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఏబీవీపీ నేతలు ఆరోపణలు చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, వెంటనే టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేశారు. యువతకు న్యాయం జరిగేలా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

లీకేజీ వ్యవహారంలో నిరసన తెలిపిన బీజేవైఎం నేతల అరెస్టుపై బీజేవైఎం కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేవైఎం గోల్కొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నాపత్రం లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరితే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సహా నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంపై ధ్వజమెత్తారు. అరెస్ట్ చేసిన బీజేవైఎం నాయకులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.



Next Story