వైద్యారోగ్య శాఖలో బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..

by Malleboina Mahesh |

రాష్ట్రంలోని వైద్యారోగ్యశాఖలో జనరల్ బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 1, 2026 నాటికి మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికే వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు.

వైద్యారోగ్య శాఖలో బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యశాఖలో జనరల్ బదిలీల ప్రక్రియ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీల వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల వివరాలను సేకరించి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని డీఎంఈ శనివారం ఒక అత్యవసర సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. జీవో నెం. 38 లో పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా జనవరి 1, 2026 నాటికి మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను ఈ బదిలీలకు అర్హులుగా పరిగణించారు.

ఈ మేరకు వైద్యారోగ్యశాఖ అధికారిక బదిలీల పోర్టల్‌లో ప్రాధాన్యత దరఖాస్తు ఫామ్ ను ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చారు. నాలుగేళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. వీరికి సంబంధించిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను శనివారం రాత్రి అందుబాటులోకి తీసుకొచ్చి అర్ధరాత్రి వరకు అవకాశం ఇస్తారని అధికారులు తెలిపారు. స్పౌస్ కేటగిరీకి చెందని, నాలుగేళ్ల కంటే తక్కువ సర్వీస్ ఉన్న అభ్యర్థులకు కూడా ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కోరింది. ఈ మేరకు శనివారం మంత్రిని కలిసి పలు సమస్యలను టీటీజీడీఏ సెక్రటరీ జనరల్ డాక్టర్ కిరణ్ మాదాల మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Next Story