ధరణి, భూ భారతి అక్రమాలపై సర్కార్ నజర్.. త్వరలోనే 'సిట్' (SIT) ఏర్పాటు?

by Kema Shiva Kumar |

ధరణి, భూ భారతి పోర్టల్స్‌లో అధికారుల లాగిన్ల ద్వారా జరిగిన భూ అక్రమాలు ఫోరెన్సిక్ ఆడిట్‌లో బయటపడ్డాయి.

ధరణి, భూ భారతి అక్రమాలపై సర్కార్ నజర్.. త్వరలోనే సిట్ (SIT) ఏర్పాటు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ రికార్డుల నిర్వహణ కోసం గతంలో తెచ్చిన ధరణి పోర్టల్, ఆ తర్వాత వచ్చిన భూభారతిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తహశీల్దార్ ఆఫీస్ నుంచి సీసీఎల్ఏ కార్యాలయం వరకు ఉద్దేశ్యపూర్వకంగానే రికార్డులు మార్చేశారని ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికల ద్వారా తెలుస్తున్నది. ‘తెలియక బటన్ నొక్కాం.. మా తప్పేం లేదు’ అంటూ బుకాయిస్తున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ వ్యవహారంపై వారం రోజుల్లో విచారణ కమిటీ తుది నివేదిక ఇచ్చే అవకాశముండగా.. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయనున్నట్లు చర్చ జరుగుతున్నది.

ఫోరెన్సిక్ ఆడిట్‌తో..

ధరణి పోర్టల్ లెగసీ కోడ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అయితే ఒక్కొక్కటిగా లోపాలు బయటపడుతుండడంతో ధరణి ఆర్కిటెక్చర్ ను భూ భారతి చట్టానికి అనుగుణంగా మార్చుకొని సర్దుబాటు చేస్తూ వచ్చారు. పాత ఆర్కిటెక్చర్ లో అనేక పొరపాట్లు కనిపించగా.. ఫోరెన్సిక్ ఆడిట్ లో అక్రమాల చిట్టా బయటపడింది. భూ భారతి చట్టం, రూల్స్ కికు అనుగుణంగా ఎన్ఐసీ ఆధ్వర్యంలో కొత్త వెబ్ సైట్‌ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే పాత ఆర్కిటెక్చర్ లోని లోపాలను అధ్యయనం చేయడానికే కమిటీ పని చేస్తున్నట్లు ఓ అధికారి ‘దిశ’కు వివరించారు. కొత్త వెబ్ పోర్టల్ ను రూపొందించే వరకు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను నిలిపివేయలేమని, అందుకే పాత ఆర్కిటెక్చర్ ను కొనసాగించాల్సి వస్తుందని చెప్తున్నారు.

బయటపడకుండా అడ్డగింత

సాఫ్ట్ వేర్ అదే కావడంతో ధరణి అక్రమాలు భూ భారతిలోనూ కంటిన్యూ అయ్యాయి. అయితే ఇవి బయటపడకుండా కొందరు అక్రమార్కులు అడ్డుకుంటున్నారు. ‘అయ్యో.. అనుకోకుండా ప్రెస్ అయ్యింది.. కావాలని చేయలేదు.’ ఇలాంటి కారణాలతో తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తహశీల్దార్ కార్యాలయంలోని భూ భారతి/ధరణి ఆపరేటర్ మొదలుకొని కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయం వరకు అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఉద్దేశ్యపూర్వకంగానే చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. చెక్ లిస్ట్ ప్రకారం చేయాల్సిన సందర్భాల్లో అవేవీ లేకుండానే క్లియరెన్స్ చేశారు. వారి స్క్రీన్ లోనే దర్శనమిచ్చే డేటానే మార్చేశారు.

ఉద్దేశ్యపూర్వకంగానే

ధరణి, భూ భారతి పోర్టల్ ద్వారా చోటు చేసుకున్న అక్రమాలన్నీ అధికారుల ఐడీ ద్వారా లాగిన్ అయి చేసినవేనని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. ధరణి, భూ భారతి అక్రమాలపై వేసిన కమిటీ కూడా ఇలాగే ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. సిస్టంను హ్యాక్ చేసి, సర్వర్ ను టచ్ చేసేంత టెక్నికల్ సపోర్ట్ కలిగిన వ్యక్తులు చేసిన పనులు కాదని నిర్ధారించారు. లాగిన్, లాగ్ అవుట్.. ఈ మధ్య ప్రతి అప్ డేట్ లోనూ చెక్ లిస్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులదే. అది లేకుండానే ల్యాండ్ డిటెయిల్స్ అప్ డేట్, చేంజెస్ జరిగిపోయాయి. కానీ ఇప్పుడేమో తప్పించుకోవడానికి కారణాలు చెప్తున్నట్లు తెలిసింది.

కోడ్ ఆడిట్..

ధరణి పోర్టల్ ను టెర్రాసిస్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎన్ఐసీకి అప్పగించింది. ఈ క్రమంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు, కోడ్ లో పొరపాట్లు లేవని టెర్రాసిస్ నిర్ధారించిందని అధికారులు అంటున్నారు. అంటే ఈ ఇల్లీగల్ ఎంట్రీస్, చేంజెస్ ను హిస్టరీ ఆధారంగా గుర్తించొచ్చు. దీంతో ఇప్పుడు కోడ్ ఆడిట్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రతి సంవత్సరం సెక్యూరిటీ ఆడిట్ మాత్రమే చేస్తున్నారు. సీడాక్ ద్వారా ఈ ప్రక్రియ నడుస్తుంది. ఐతే కోడ్ ఆడిట్ ఎప్పుడూ చేయలేదు. ఇది చేస్తే చిన్న చిన్న లోపాలు కూడా బయటపడుతాయి. సుమారు 40 లక్షల ట్రాన్సాక్షన్లలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో గుర్తించే ప్రక్రియ నడుస్తుంది. భవిష్యత్తులో తప్పులు రిపీట్ కాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి కూడా కమిటీ చర్చిస్తున్నది. కొత్త పోర్టల్ రూపొందించేటప్పుడు ధరణి కోర్సు ఓ స్టడీగా మారింది.

భూ భారతిలోనూ అక్రమాలు అనేకం

ధరణి పోర్టల్ లోని లోపాలు, సాఫ్ట్ వేర్ ను ఆసరాగా చేసుకొని ఎక్కడి నుంచైనా, ఎవరి లాగిన్ నుంచైనా చేంజెస్ చేసుకున్నారు. భూ భారతిలోనూ అదే పరంపర కొనసాగింది. ప్రస్తుతం కమిటీ నాలుగు రకాలుగా విశ్లేషిస్తున్నది. సిస్టమ్ ని హ్యాకింగ్ చేశారా? సర్వర్ ని అటాక్ చేశారా? అమాయకులైన ఆపరేటర్లు, అధికారులు చేశారా? ఉద్దేశ్యపూర్వకంగానే ఫ్రాడ్ చేశారా? ఇందులో ఫ్రాడ్ ద్వారా ఎన్ని జరిగాయి. వాటిలో క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఎన్ని ఉన్నాయి? ఆ అక్రమాలు ఎన్ని రకాలు? వీటిని అనలైజ్ చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. అయితే ఈ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. ఎవరినీ వదిలిపెట్టొద్దన్న సూచనలు ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.

సెక్యూరిటీ ఆడిట్ టైంలోనూ..

టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీకి పోర్టల్ డేటా బదిలీ చేసినప్పుడు సెక్యూరిటీ ఆడిట్ చేశారు. ఈ క్రమంలోనే ఆధార్ ఎన్ క్రిప్షన్ చేశారు. దాంతో లోపాలు బయటపడ్డాయి. రిపేర్ చేయగా కొంత కాలం బాగానే పని చేసింది. ఆ తర్వాత పోర్టల్ లో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ధరణి పోర్టల్ వైఫల్యానికి, స్లో కావడానికి, స్లాట్స్ బుక్ కాకపోవడానికి వందకుపైగా కారణాలను గుర్తించారు. ఐతే అప్పటి నుంచి కొత్త వెబ్ సైట్ ను రూపొందించకుండా కంటిన్యూ చేయడంతో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.

బాధ్యులను గుర్తించేందుకు సిట్?

ఎన్ఐసీ రూపొందించిన భూ భారతి పోర్టల్ కూడా ధరణి ఆధారిత టెక్నాలజీ కావడంతో లోపాలకు అవకాశం ఉంది. ధరణి పోర్టల్ ద్వారా మాడ్యూల్స్ రూపొందించిన వ్యక్తులే దీని వెనుక ఉన్నట్లుగా ప్రభుత్వం అనుమానించింది. ఈ నేపథ్యంలో బాధ్యులను గుర్తించడం, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ప్రారంభించడం, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు సూచించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మరో వారం రోజుల్లో కమిటీ రిపోర్ట్ ఇవ్వనున్నది. ఐతే అక్రమాలపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Next Story