- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటింటికీ తిరగని బీఎల్ఓలు.. SIR ప్రక్రియపై సర్వత్రా విమర్శలు!
తెలంగాణలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అధికారుల లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన కరువైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: సమగ్ర ఓటరు జాబితా సవరణ రాష్ట్రంలో లోపాలమయంగా తయారు అయింది. బూత్ లెవల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమై 12 రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు కనీసం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాలేదు. కానీ ఎన్నికల సంఘం అధికారులు మాత్రం 96 శాతం ఎన్యుమరేషన్ పారాలు పంపిణీ చేసినట్లుగా లెక్కలు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ సహా మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్షలాది మంది తమకు ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదని ఫిర్యాదు చేస్తున్నారు. బీఎల్వోల నుంచి సరియైన స్పందన ఉండటంలేదు. కొందరు బీఎల్వోలకు ఫోన్లు చేసినా స్పందించడంలేదని తెలిసింది. రంగారెడ్డి జిల్లాలో 93 శాతం, సంగారెడ్డి జిల్లాలో 92 శాతం, మేడ్చల్‌లో 88 శాతం, హైదరాబాద్ జిల్లాలో 81 శాతం ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఈ జిల్లాల్లో ఇంకా లక్షల సంఖ్యలో ఫారాలు అందని వారున్నారు. తమ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి బీఎల్వోలు ఫారాలు పంపిణీని తప్పుడు లెక్కలు చూపుతున్నారని అంటున్నారు. నిర్మల్, గద్వాల జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఫారం అందించారని, 100 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారని ఎన్నికల అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వనపర్తి జిల్లాలో 99.95 శాతం, నాగర్‌కర్నూలు జిల్లాలో 99.98 శాతం, కామారెడ్డిలో 99.31 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 99.62 శాతం, పట్టణ ప్రాంతంగా ఉన్న ఖమ్మంలో 99.60 శాతం, కరీంనగర్ జిల్లాలో 99.18 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 99.14 శాతం, మంచిర్యాలలో 99.19 శాతం, సిరిసిల్లలో 99.76 శాతం, సిద్దిపేటలో 99.72 శాతం, నిజామాబాద్ జిల్లాలో 98.85 శాతం ఫారాలను పంపిణీ చేసినట్లుగా చెబుతున్నారు.
సర్వత్రా విమర్శలు..
బూత్ లెవల్ ఆఫీసర్లపై సరియైన నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో వారి పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొదట ఎన్నికల సంఘం అధికారులు వారం రోజుల్లో ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన మూడు వారాల్లో పంపిణీ ఫారాలను తిరిగి తీసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు పెట్టుకున్న లక్ష్యాన్ని ఇంత వరకు పూర్తి చేయలేదు. చాలా మంది తమకు ఓటు హక్కు ఉండాలనే ఉద్దేశంతో ఆన్లైన్ విధానాన్ని స్టడీ చేసి దానికి సంబంధించిన వివరాలను తెలుసుకొని ఆన్లైన్లో సమర్పిస్తున్నారు. మరికొందరు బీఎల్వోల వివరాలు, తెలుసుకొని వారికి ఫోన్ చేయడం, లేదా వారిని స్వయంగా కలిసి ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకుంటున్నారు. ఓటర్లలో ఉన్న ఆసక్తి, ఉత్సాహం, బీఎల్వోల్లో కానీ ఎన్నికల సంఘం అధికారులు కానీ కనిపించడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇప్పటికే ఎన్నికల సంఘం, బీఎల్వోలపై విమర్శలు ప్రారంభించారు. నిలదీతలు మరింత పెరిగే ఆస్కారముంది. బీఎల్వోలు, జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారుల పనితీరు విమర్శల పాలు చేస్తోంది.
ముంచుకొస్తున్న సమయం
ఈ నెల 24వ తేదీలోగా ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత వరకు ఎన్యుమరేషన్ ఫారాలే అందలేదు... వాటిని ఎప్పుడు రిటర్న్ చేయాలని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు బీఎల్వోలు మాత్రం ఫారాలు పంపిణీ చేయకుండా కుంటిసాకులు చూపుతున్నారు. తాము వెళ్లినప్పుడు వారు ఇంట్లో ఉండటంలేదని, తాళాలు వేసి ఉంటున్నాయని, అనేక మంది అక్కడ నివాసం ఉండటంలేదని చెప్పితప్పించుకుంటున్నారు. ఇంటింటికి తిరగాలని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టంగా చెబుతున్నా సరియైన స్పందన మాత్రం రావడంలేదు. ఒకే దగ్గర కూర్కొని ఫారాలను పంపిణీ చేస్తున్నారు. వారిపై ఫిర్యాదులు చేసినా ఇంటింటికి తిరగకుండా ఒకే దగ్గర ఉండి పంపిణీ చేస్తున్నారు. మరో వైపు బీఎల్వోలను నగరాల్లో కనీస పరిజ్ఞానం లేని వారిని నియమించారని, దీంతో వారికే ఈ ప్రక్రియ గురించి పూర్తి స్థాయిలో అర్థం కావడంలేదని, అలాంటిప్పుడు ఓటర్లకు ఏ విధంగా చెబుతారని ప్రశ్నిస్తున్నారు.






