సంస్థాగత నిర్మాణంపై సర్కారు నజర్.. నవంబర్ లో నియామకాలు పూర్తి?

by Naga Rani Yarlagadda |

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడటంతో సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టిన జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుల నియామకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది.

సంస్థాగత నిర్మాణంపై సర్కారు నజర్.. నవంబర్ లో నియామకాలు పూర్తి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడటంతో సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టిన జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుల నియామకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది. ఇప్పటికే డీసీసీల నియామకం కోసం 22 మంది ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించారు. వారిలో మాజీ సీఎంలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ స్పీకర్లు వంటి ప్రముఖులు ఉన్నారు. వారంతా ఈనెల 18 వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆశావహులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారితో పాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు లేదా ముగ్గురు పరిశీలకులను టీపీసీసీ నియమించింది. ఇప్పటికే ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు నూతన డీసీసీ చీఫ్ ల నియామకం కోసం ప్రకటన విడుదల చేశారు. ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదవులను ఆశించేవారు పార్టీకి చేసిన సేవలు, రాజకీయ అనుభవం, ఇదివరకు పార్టీలో నిర్వహించిన పదవులు, బాధ్యతలు, పదవి ఇస్తే పార్టీకి ఏ విధంగా న్యాయం చేస్తారనే అంశాలతో కూడిన వివరాలు, వారి బయోడేటాను సేకరించనున్నారు. ఈనెల 18న దరఖాస్తుల స్వీకరణ ముగియగానే పరిశీలకులు ఆ జాబితాను సీఎం, టీపీసీసీ చీఫ్​దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం జిల్లాకు చెందిన జిల్లా ఇన్ చార్జి​మంత్రులు, జిల్లా ఇన్ చార్జిలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సామాజికవర్గాల వారీగా..

ఏఐసీసీ పరిశీలకులు ప్రతి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి డీసీసీ అధ్యక్షులుగా అనుకూలమైన అభ్యర్థుల జాబితాను రూపొందించనున్నారు. ఆయా సామాజిక కోణాలను పరిశీలించి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, జనరల్​వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వారం రోజుల పాటు అందరి అభిప్రాయాలను సేకరించిన అనంతరం డీసీసీ అధ్యక్ష పదవికి అర్హులైన జాబితాను ఈనెల 18వ తేదీ తర్వాత ఏఐసీసీకి అందజేయనున్నారు. ఈ జాబితా ఏసీసీకి అందిన తర్వాత నూతన డీసీసీ అధ్యక్షులు, కార్యవర్గాన్ని నవంబర్​మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది.

రేసులోకి నేతల వారసులు

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతం వాయిదా పడటంతో పదవులపై ఆశావహుల లిస్ట్ పెరిగిపోతున్నది. డీసీసీ అధ్యక్ష పదవిని ఆశించే వారి సంఖ్య పెద్దఎత్తున పెరిగినట్లు తెలిసింది. కొన్ని జిల్లాలో మంత్రుల వారసులు, ముఖ్యనేతల బంధువులు ఆయా పదవులను ఆశిస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల లోపు ఈ డీసీసీ నియామక ప్రక్రియ ముగియనుంది. వీరి సారథ్యంలో ఎన్నికలు వెళ్లాల్సి రావడంతో డీసీసీ అధ్యక్ష పదవులు కీలకంగా మారాయి. ఇదిలాఉండగా, ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. అన్ని జిల్లాలకు కమిటీల ప్రకటన నేపథ్యంలో పాతవారిని ఎంత మందిని కొనసాగిస్తారు..? కొత్తగా ఎంతమందిని నియమిస్తారన్న చర్చ పార్టీలో జోరుగా నడుస్తున్నది.

ఏఐసీసీ కార్యాచరణ

ఏఐసీసీ పరిశీలకులు శనివారం తమ కార్యాచరణ మొదలుపెట్టారు. జిల్లాల తర్వాత నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. డీసీసీల ఎంపిక కోసం పార్టీ నేతలు, రాజకీయ మేధావుల అభిప్రాయాన్ని కూడా సేకరించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. పోటీలో ఉన్న ఆశావహులతో పరిశీలకులు ముఖాముఖిగా మాట్లాడనున్నారు. ఎంపికలో ఎలాంటి ఒత్తిళ్లు, పైరవీలకు తావు లేకుండా ప్రక్రియ ఉంటుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులపై అభిప్రాయాలను సేకరణతో పాటు వారిపై ఉన్న అభ్యంతరాలను సైతం పరిశీలించనున్నట్లు సమాచారం.

Next Story