- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెంపుల్ టూరిజంపై సర్కార్ ఫోకస్.. ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
ఆలయాల అభివృద్ధిపై దేవాదాయ శాఖ ఫోకస్ పెట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆలయాల అభివృద్ధిపై దేవాదాయ శాఖ ఫోకస్ పెట్టింది. టెంపుల్ టూరిజానికి దోహదపడేలా మాస్టర్ ప్లాన్ రూపొందించి డెవలప్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో సుమారు రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రెడీఅయింది. ముఖ్యంగా చెరువుగట్టు, కొండగట్టు, భద్రాచలం, వేములవాడ ఆలయాలకు భారీగా నిధులు కేటాయించింది.
యాదగిరిగుట్టలో ఇలా..
యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి 60 కిలోల బంగారు తాపడం పనులు జరుగుతున్నాయి. ఇందులో దేవస్థానం వద్ద నిల్వ ఉన్న 25 కిలోల బంగారంతోపాటు విరాళంగా వచ్చిన 35 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నారు. గోల్డ్ ప్లేటింగ్ తయారీ, ఫిక్సింగ్ చార్జీలకు కలిపి మొత్తం రూ. 8 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. రానున్న బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి. ఇంకా 17 ఎకరాల్లో రూ.43.79 కోట్లతో వేదపాఠశాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. దీంతోపాటు వసతి గృహాన్ని ఏర్పాటు చేయడానికి 101 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తుల వసతి కోసం కొండపై డార్మెటరీ హాల్ ఏర్పాటు చేశారు. వైటీడీఏకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించడంతోపాటు పరిపాలనలో పారదర్శకతకు పట్టం కట్టారు.
వేములవాడలో..
వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.76 కోట్లు మంజూరు చేసింది. దీనిలో అన్నదానం సెంటర్ నిర్మాణానికి రూ.35.25 కోట్లు కేటాయించింది. శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధి, గుడి చెరువు సుందరీకరణకు మరో రూ.20 కోట్లు మంజూరు చేసింది.
ఇతర దేవాలయాలకు ఇలా..
భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా భూ సేకరణకు ప్రభుత్వం రూ.60.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. వరంగల్ లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయ మాడవీధుల ఏర్పాటు, నిర్మాణానికి రూ.30 కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధులు, కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) నిధుల నుండి కేటాయించింది. మాడవీధుల పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతోపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొడవటంచశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, దేవాలయ అభివృద్ధికి రూ.12.15 కోట్లు మంజూరు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ కురుమూరి జాతరకు సంబంధించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే రూ.110 కోట్లతో కొండపైకి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని వైరా స్థానాల లక్ష్పురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కల్యాణ వేదిక, అభిషేక మండపం, వసతి గృహాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.20 కోట్లు మంజూరు చేసింది. కామారెడ్డి జిల్లాలోని సలాబత్‌పూర్ శ్రీ మారుతీ మందిర్‌కు సంబంధించి రూ.6.70 కోట్లతో కల్యాణమండపం, ప్రకారమండపం, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.






