- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌పై సర్కార్ ఫోకస్.. ఫ్లడ్ వాటర్ నిర్వహణకు మాస్టర్ ప్లాన్
గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీయూసీఆర్) పరిధిలో వరద నీటి కాలువల నిర్వహణ, ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీయూసీఆర్) పరిధిలో వరద నీటి కాలువల నిర్వహణ, ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో వరదలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) విస్తరించాలని నిర్ణయించిన తరుణంలో వరద నీటి కాలువల గుర్తింపు, వర్షపు నీరు ఇంకే మార్గాలు, మూసీలో కలిసే మార్గాలను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లో సమగ్ర వరదనీటి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కన్సల్టెంట్ ఎంపిక చేయడానికి ఎక్స్ ఫ్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) కోసం అనుమతి ఇస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్ మెంట్ సెక్రెటరీ కె.ఇలంబర్తి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
వర్షపాతానికి లింకు.. విపత్తులకు చెక్
వరదనీటి కాలువలను గుర్తించి మ్యాపింగ్ చేయనున్నారు. జీహెచ్ఎంసీ ఏరియాతోపాటు ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలతోపాటు పలు గ్రామాల్లో సైతం వరదనీటి కాలువలను గుర్తించి మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదవుతోంది? దానికనుగుణంగా వరదనీటి కాలువలు ఉన్నాయా? ఉంటే వరద సాఫీగా సాగుతుందా? చెరువులు, కుంటలు ఉన్నాయా? వరదనీరంతా వాటిలోకి పోతుందా? పోకపోవడానికి అడ్డంకులేమైనా ఉన్నాయా? గుర్తించనున్నారు.
అన్నింటికి అనుసంధానం
మహానగరంలో చిన్న, మధ్య, భారీ తరహా నాలాలన్నీ సుమారు 800 కి.మీ.ల పొడువున ప్రవహిస్తుండగా, వీటిలో ఐదు మేజర్ నాలాలు దాదాపు 339 కి.మీ.ల మేరకు ప్రవహిస్తున్నాయి. మహానగరంలో చినుకు పడిందంటే చాలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావాల్సిందే. ఎందుకంటే నీరు ఇంకిపోవడానికి లేదు.. ఆ నీళ్లు సాఫీగా వెళ్లడానికి లేదు. ఈ సమస్య దశాబ్దాలపాటు నగరాన్ని వెంటాడుతూనే ఉంది. ఇరవై ఏళ్ల క్రితం నగరాన్ని వర్షం ముంచెత్తినపుడు శాశ్వత పరిష్కారం కోసం అప్పటి ప్రభుత్వం నియమించిన కిర్లోస్కర్ కమిటీ చేసిన ఈ సిపార్సులను అమలు చేసి, నాలాలపై ఆక్రమణలను తొలగించాల్సిన అధికారులు ఎప్పటికపుడు ఆక్రమణలు పెరుగుతూ ఉన్నా, చూసీచూడనట్లుగా వ్యవహరించటం వల్లే నేడు ఈ దుస్థితి నెలకొంది. దీంతోపాటు వయాంట్స్ ఏజెన్సీ ద్వారా సైతం సర్వే చేయించారు. తర్వాత జేఎన్టీయూ సర్వే చేసి రిపోర్టు ఇచ్చింది. ఆ నివేదికలను అటకెక్కించారు. 2020 వరదల తర్వాత నగరంలో వరదనీటి కాలువలను అభివృద్ధి చేయడానికి స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్డీపీ) విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయినా జీహెచ్ఎంసీ పరిధిలో ఆశించిన ఫలితాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. దీన్ని అప్‌గ్రేడ్ చేయడానికే స్ట్రామ్ వాటర్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మాస్టర్ ప్లాన్‌ను జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాలు, వరదనీటి కాలువలు, చెరువులు, కుంటలు, హుస్సేన్ సాగర్, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోని చెరువులు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మూసీతో సహా అన్నింటిని అనుసంధానం చేయనున్నారు. ఫలితంగా వరదలను తగ్గించడానికి అవకాశముందని ప్రభుత్వం భావిస్తున్నది.
మాస్టప్ ప్లాన్ కోసం ఈవోఐ
జీహెచ్ఎంసీతోపాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోనూ స్ట్రామ్ వాటర్ మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఈవోఐ పిలవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మాస్టర్ ప్లాన్‌లో వరద నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరదనీటి కాలువల మోడల్స్, వరద నివారణ మార్గాలు, భారీ వర్షాల నేపథ్యంలో వరదలను తగ్గించేందుకు డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధిచేయనున్న ప్రాంతాలను గుర్తించాలని ప్రస్తావించారు. మాస్టర్ ప్లాన్‌లో వరదనీటి కాలువలతోపాటు కాలుష్యాన్ని తగ్గించే బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేయాలని సూచించారు. అనవసరంగా నిధులు ఖర్చు చేయకుండా వరద నివారణకు అవసరమైన ప్రాంతాల్లోనే బడ్జెట్ ఖర్చు చేయాలని సూచించారు. వరద నీటి మాస్టర్ ప్లాన్ ఆధారంగా పట్టణ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేవిధంగా ఉండాలని సూచించారు. వీటన్నింటికి ప్రాధాన్యతనిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించేలా చర్యలు తీసుకోవాలని, అందుకు కన్సల్టెంట్ నియమించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో కన్సల్టెంట్ నియామకానికి చర్యలు తీసుకోనున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.






