టీవీవీపీ బదిలీల్లో ఖాళీల మాయాజాలం.. ఆందోళనలో ప్రభుత్వ వైద్యులు!

by Gantepaka Srikanth |

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో సాగుతున్న సాధారణ బదిలీల ప్రక్రియ ప్రభుత్వ వైద్యుల్లో తీవ్ర అసంతృప్తికి, ఆందోళనకు దారితీస్తోంది.

టీవీవీపీ బదిలీల్లో ఖాళీల మాయాజాలం.. ఆందోళనలో ప్రభుత్వ వైద్యులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో సాగుతున్న సాధారణ బదిలీల ప్రక్రియ ప్రభుత్వ వైద్యుల్లో తీవ్ర అసంతృప్తికి, ఆందోళనకు దారితీస్తోంది. బదిలీల నిర్వహణలో ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాల వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా ఖాళీలను దాచిపెడుతున్నారని టీవీవీపీ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 2 నుంచి బదిలీల ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, వాట్సప్ గ్రూపుల్లోనూ, అసోసియేషన్ వేదికగానూ వైద్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

కీలక సమయంలో కమిషనర్ పోస్టు ఖాళీ!

వైద్యారోగ్య శాఖలో అత్యంత కీలకమైన టీవీవీపీ విభాగానికి ప్రస్తుతం నాథుడే లేకుండా పోయారు. పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ గత నెల 31న పదవీ విరమణ చేశారు. సాధారణంగా ఒక కీలక అధికారి రిటైర్ అవుతున్నారంటే.. దానికి ఒక పదిహేను రోజుల ముందే నూతన కమిషనర్ నియామకంపై కసరత్తు జరగాలి. కానీ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కనీసం అలాంటి ముందస్తు ప్రణాళికే కరువైందనే విమర్శలు వస్తున్నాయి. వేలాది మంది వైద్యుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న బదిలీల ప్రక్రియ నడుస్తున్న ఇలాంటి కీలక సమయంలో, అసలు కమిషనరే లేకుండా బండిని నడిపించడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. పూర్తిస్థాయి హెడ్ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని బదిలీల్లో అనేక అక్రమాలకు తెరలేపుతున్నారని వైద్యులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం గ్రీవెన్స్ (ఫిర్యాదుల) పరిష్కారం కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన కమిటీ వేశామని చేతులు దులుపుకుంటోంది తప్ప, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది.

ఖాళీల దాగుడుమూతలు.. నిబంధనల ఉల్లంఘన!

ఆర్థిక శాఖ జారీ చేసిన జీఓ ప్రకారం సాధారణ బదిలీల్లో అన్ని స్పష్టమైన ఖాళీలను చూపెట్టాల్సి ఉంది. ఖాళీలను దాచిపెట్టడానికి వీల్లేదని స్పష్టమైన రూల్ ఉన్నప్పటికీ, అధికారులు మాత్రం జిల్లా ఆసుపత్రుల (డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్) పోస్టులను దాచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 ప్రమోషన్ల సమయంలో ఈ జిల్లా ఆసుపత్రుల పోస్టులను చూపించలేదు. మళ్లీ 2024 జనరల్ ట్రాన్స్‌ఫర్స్‌లో చూపించారు. తీరా ఇప్పుడు 2026 బదిలీల్లో మళ్లీ ఆ పోస్టులను మాయం చేశారు. స్థిరమైన పాలసీ లేకపోవడం వల్లే ఈ గందరగోళం నెలకొందని వైద్యులు మండిపడుతున్నారు. టీవీవీపీ ఆసుపత్రుల్లోని పోస్టుల రీ-డెవలప్‌మెంట్ (పునర్వ్యవస్థీకరణ) ప్రక్రియను అధికారులు నానబెడుతూ సాగదీస్తున్నారు. రీ-డెవలప్‌మెంట్‌ను త్వరితగతిన పూర్తి చేసి బదిలీలు చేపడితే.. జిల్లా ఆసుపత్రి పోస్టులన్నీ టీవీవీపీ పరిధిలోకి వస్తాయి. దీనివల్ల అన్ని ఆసుపత్రులు పూర్తిస్థాయిలో సిబ్బందితో నిండుతాయి. కానీ ఈ ఆలస్యం వల్ల అటు బదిలీలు, ఇటు ప్రమోషన్లు, చివరకు కొత్త రిక్రూట్‌మెంట్‌పై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది.

ఎగ్జిట్ మాత్రమే... ఎంట్రీ లేదు!

ప్రస్తుత నిబంధనల ప్రకారం జిల్లా ఆసుపత్రుల నుంచి కేవలం ఎగ్జిట్ (బయటకు వెళ్లడం) మాత్రమే ఉంది తప్ప, కొత్తగా వచ్చే వారికి ఎంట్రీ లేకుండా చేశారు. బదిలీలు అన్నప్పుడు ఇన్ అండ్ అవుట్ రెండూ ఉండాలి కదా.. అని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు కమిషనర్ లేకపోవడం, మరోవైపు నిబంధనల ఉల్లంఘనలతో వ్యవస్థ మొత్తం గందరగోళంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్యాయాలపై ఇప్పటికే వైద్యారోగ్య శాఖ మంత్రికి, హెల్త్ సెక్రటరీకి, హెల్త్ కమిషనర్‌కు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వైద్యులు వాపోతున్నారు. నేటి నుంచే ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో వైద్యుల్లో తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, తన మొండి వైఖరిని వీడి, తక్షణమే పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించడంతో పాటు.. రీ-డెవలప్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసి అన్ని ఖాళీలను బదిలీల్లో చూపించాలని టీవీవీపీ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story