‘మేడిగడ్డ’ పునరుద్ధరణపై సర్కార్ సమాలోచనలు.. ఏబీ పాండ్య కమిటీకి బ్రేక్!

by Kema Shiva Kumar |

మేడిగడ్డ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని భావించింది.

‘మేడిగడ్డ’ పునరుద్ధరణపై సర్కార్ సమాలోచనలు.. ఏబీ పాండ్య కమిటీకి బ్రేక్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈఎన్సీ సైతం కమిటీ కూర్పుపై కసరత్తు చేశారు. అందులో భాగంగానే 9 మందితో కూడిన జాబితాను ఆయన సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించారు. ప్రధానంగా సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య చైర్మన్‌గా జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాను అందజేసి 20 రోజులకు పైనే గడుస్తున్నా ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఆ జాబితాకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. అయితే.. కమిటీకి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంపై ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరుకోవడం.. ఫైనల్ రిపోర్టు త్వరలోనే ప్రభుత్వానికి అందే పరిస్థితులు ఉండడంతో ప్రభుత్వం కమిటీకి బ్రేక్ వేసిందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ పైనల్ రిపోర్టు ఇచ్చిన తరువాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

కమిటీలో తొమ్మిది మంది..

మేడిగడ్డ పునరుద్ధరణపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిటీలో ఎవరెవరు ఉండాలనే అంశంపై నీటి పారుదల శాఖ ఈఎన్సీ జనరల్ జి.అనిల్‌కుమార్ కసరత్తు చేశారు. ఈ మేరకు 9 మందితో కూడిన జాబితాను ప్రభుత్వానికి అందించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జాబితాను రూపొందించారు. ముఖ్యంగా ఈ కమిటీకి సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య చైర్మన్‌గా ఎంపిక చేశారు. ఆయనతోపాటు ఈఎన్సీ జనరల్ జి.అనిల్ కుమార్, ఈఎన్సీ ఓఅండ్ఎం శ్రీనివాస్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ ప్రశాంత్‌చంద్ర, సీఈ రామగుండం, రిటైర్డ్ సీఈ (గేట్స్) సత్యనారాయణ, ఐఐటీ హైదరాబాద్ హైడ్రాలిక్ నిపుణుడు సతీష్, ఐఐటీ వరంగల్ జియో టెక్నికల్ రమణమూర్తితోపాటు మరో అధికారిని ఈ కమిటీలో చేర్చారు.

పునరుద్ధరణ బాధ్యత కమిటీదే..

ఇప్పటికే ఎన్‌డీఎస్ఏ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. అంతకుముందే విజిలెన్స్ రిపోర్టులు కూడా ప్రభుత్వానికి అందాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సైతం మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టాలని భావించింది. అందులో భాగంగానే కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. కమిటీ ఆధ్వర్యంలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించి అన్ని పరీక్షలూ నిర్వహించాలని భావించారు. జియో టెక్నికల్‌తోపాటు హైడ్రాలాజీ, సాయిల్ పరీక్షలు చేపట్టాలనుకున్నారు. అలాగే.. మేడిగడ్డలో కాఫర్ డ్యామ్ నిర్మించడమా? లేదంటే రింగ్ బండ్ లాంటి నిర్మాణాల ద్వారా పునరుద్ధరణ చర్యలు తీసుకోవడమా? అనేది కూడా ఈ కమిటీనే నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఇవ్వాలని భావించారు. మరోవైపు.. ఎన్‌డీఎస్ఏ సైతం మేడిగడ్డ పునరుద్ధరణపై పలు సూచనలు చేయడంతో వాటిని అమలు చేసే దిశగా కమిటీకి సూచనలు చేయాలని భావించారు.

ఘోష్ రిపోర్టు తరువాతే నిర్ణయం!

అయితే.. మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో రెండు పిల్లర్లు కుంగుబాటుకు గురైన విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఏడాదిన్నరగా కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన వారందరినీ విచారించింది. ఇప్పటివరకు 150 మందిని విచారించింది. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీ సంస్థలతోపాటు పలువురు ఐఏఎస్‌లను, ప్రైవేటు వ్యక్తులను సైతం ఎంక్వయిరీ చేశారు. ఇటీవల మాజీమంత్రులైన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ను కూడా కమిషన్ విచారించింది. వారితోపాటే మాజీసీఎం కేసీఆర్‌ను సైతం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. దీంతో కమిషన్ విచారణలు దాదాపుగా పూర్తయినట్లేనన్న టాక్ నడుస్తున్నది. ఇక ఫైనల్ రిపోర్టు రెడీ చేసి ప్రభుత్వానికి ఇవ్వడమే తరువాయి అని తెలుస్తున్నది. అయితే.. కమిషన్ రిపోర్టు వచ్చిన తరువాతనే ఏబీ పాండ్య కమిటీపై ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నదా..? లేక కమిటీపై ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోవద్దని ఆలోచనకు వచ్చిందా అనేది తెలియకుండా ఉంది. రిపోర్టు ఆధారంగానే తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నదా అన్న టాక్ నడుస్తున్నది.

Next Story