BC రిజర్వేషన్లపై సర్కార్ సమాలోచనలు.. సుప్రీం కోర్టుకు వెళ్లే యోచన

by Kema Shiva Kumar |

బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

BC రిజర్వేషన్లపై సర్కార్ సమాలోచనలు.. సుప్రీం కోర్టుకు వెళ్లే యోచన
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు తొలుత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం ఆమోదం కోసం గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మకు పంపించారు. కానీ, రిజర్వేషన్ల పెంపు అంశం కేంద్ర పరిధిలో ఉందని న్యాయ సలహాలు తీసుకుని, ఏప్రిల్ మొదటి వారంలో దానిని ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు. ఇప్పటికీ రాష్ట్రానికి ఎలాంటి సమాధానం రాలేదు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టులో ప్రస్తావించాలని సీనియర్ న్యాయవాదులతో సర్కారు సంప్రదింపులు జరుపుతున్నది.

తమిళనాడు తరహా వెసులుబాటు ఇవ్వాలని రిక్వెస్టు

జనాభా ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమకు వెసులుబాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఏ ప్రతిపాదికన రిజర్వేషన్లు పెంచామనే అంశాన్ని పిటిషన్‌లో పేర్కొననున్నారు. వాస్తవానికి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా, అన్ని కులాల ఆర్థిక, సామాజిక, విద్యా, రాజకీయ పరిస్థితులను సైతం అంచనా వేశారు. ఆ నివేదిక మేరకు బీసీలకు విద్యాపరంగా, రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చట్టం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో 50 శాతం కన్నా ఎక్కువగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీంతో తెలంగాణకు సైతం అలాంటి వెసులుబాటు ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్టు చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్.

పార్టీలపరంగా అప్పీలు

ఒకవేళ సుప్రీం కోర్టులో రిజర్వేషన్ల విషయంలో ఏదైనా అడ్డంకులు ఎదురైతే రాజకీయ సంప్రదింపులు జరపాలని సర్కారు భావిస్తున్నది. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అఖిలపక్షాన్ని పిలిచేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. తాము పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని, అన్ని పార్టీలు సైతం అంతే సంఖ్యలో బీసీలకు సీట్లు ఇవ్వాలని ఆయన ప్రపోజల్ పెట్టనున్నారు. ముందుగా న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళ్లి, ఆ తర్వాత రాజకీయ సంప్రదింపులు చేయడం వల్ల విపక్షాల విమర్శలకు చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది. అలా కాకుండా ముందుగా పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తే, రిజర్వేషన్ల పెంపు కోసం ఎందుకు చట్టం తెచ్చారని ప్రశ్నలు వచ్చే ప్రమాదం ఉంటుందని అంచనా వేస్తున్నది.

3 నెలలుగా రాష్ట్రపతి వద్దే బిల్లు

రాష్ట్రాలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి గరిష్ఠంగా 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కేసులో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ఒకవేళ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని రాష్ట్రపతి భావిస్తే.. న్యాయసలహా కోసం సుప్రీంకు పంపాలి. కానీ, తెలంగాణ నుంచి గవర్నర్ ఆమోదానికి పంపిన (బీసీలకు విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్) బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. అందుకే సుప్రీంకోర్టులో వేసే పిటీషన్‌లో ఈ అంశాన్ని సైతం ప్రధానంగా ప్రస్తావించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

Next Story