ఒకే పనికి ఇద్దరికి జీతాలు ఇవ్వాలా?.. ఆ ఉద్యోగులను ఏం చేయాలో తెలియక సర్కార్ సతమతం!

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-12 11:07:03  IST  )

రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. వివిధ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులను ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నది.

ఒకే పనికి ఇద్దరికి జీతాలు ఇవ్వాలా?.. ఆ ఉద్యోగులను ఏం చేయాలో తెలియక సర్కార్ సతమతం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. వివిధ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులను ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నది. ఉన్నపళంగా వారిని ఇంటికి పంపిస్తే విమర్శలు వస్తాయని గుబులు పట్టుకున్నది. అలాగని కంటిన్యూ చేద్దామంటే ఖాళీగా కూర్చోపెట్టి, జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో ప్రభుత్వం అదనపు ఆర్థిక భారం పడుతుంది. అందుకని ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను ఏం చేయాలో తేల్చాలని ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు చేసింది. వారి సిపారసుల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నది.

19 వేల కాంట్రాక్టు ఎంప్లాయిస్‌పై ఎఫెక్ట్!

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు దాదాపు 58వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఎంపికైన వారిలో మెజార్టీ మంది సర్వీస్ లో చేరారు. అయితే ఇంతకాలం ఆ పోస్టుల్లో రెగ్యులర్ ఎంప్లాయిస్ లేకపోవడంతో కాంట్రాక్టు పద్దతిలో అర్హులైన వారిని అపాయింట్ చేసుకుని జీతాలు చెల్లించారు. కాని ఇప్పుడు కొత్త నియమకాల వల్ల రెగ్యూలర్ ఎంప్లాయిస్ డ్యూటీలో చేరారు. దీనితో అదే పోస్టుల్లో ఇంతకాలంగా పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులపై ఎఫెక్ట్ పడింది. వారందరిని ఇంటికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొత్త ఉద్యోగాల వల్ల ఎంత మంది కాంట్రాక్టు ఎంప్లాయిస్ పై ప్రభావం పడుతున్నదోనని ఆర్థిక శాఖ ఆరా తీయగా, సుమారు 19వేల మందిని తొలగించాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది. ఈ జాబితాలో జిల్లా, డివిజన్, హెచ్ఓడీ, సెక్రటేరియట్ వరకు ఉన్న వివిధ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఎంప్లాయిస్ ఉన్నారు. ప్రధానంగా మున్సిపల్, ఎడుకేషన్, హెల్త్,అగ్రికల్చర్ శాఖల్లోని కాంట్రాక్టు ఎంప్లాయిస్ పై ప్రభావం పడనుంది.

ఒకే పనికి ఇద్దరికి జీతాలు ఇవ్వలా?

కొత్త ఎంప్లాయిస్‌తో ఉపాధి కోల్పొయ్యే కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను అలాగే కంటిన్యూ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. ఒకవేళ అలాగే కొనసాగిస్తే రెగ్యులర్ ఎంప్లాయిస్ తో పాటు కాంట్రాక్టు ఉద్యోగికి సైతం జీతాలు చెల్లించాల్సి ఉంటుందని, అంటే కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను ఖాళీగా కూర్చోపెట్టుకుని జీతం ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుందని అంటున్నారు. దీనితో ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు. .‘‘ఇంతకాలం పోస్టు ఖాళీగా ఉండటంతో ఆక్కడ కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను రిక్రూట్ చేసుకుని జీతం ఇచ్చాం. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగి వచ్చిన తరువాత కాంట్రాక్టు ఎంప్లాయిస్ అవరసం ఏంటీ?ఒకే పనికి ఇద్దరికి జీతాలు ఇవ్వాలా?’’అని ఐఏఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇప్పుడు వద్దంటే ఎలా?

ప్రభుత్వం గుర్తించిన ఈ 19వేల కాంట్రాక్టు ఎంప్లాయిస్ దాదాపు 10 నుంచి 12 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి నెలకు సగటును రూ. 23 వేల జీతంతో చెల్లిస్తున్నది. రెగ్యులర్ ఎంప్లాయిస్ తరహాలో వారికి సెలవులు,డీఏలు, ఇంక్రిమెంట్స్ , పీఆర్సీ ఉండదు. ప్రభుత్వం దయతలచి ఐదారేళ్లకు ఓసారి వెయ్యి లేదా రెండువేలు పెంచినప్పుడు మాత్రమే అదనపు ఆర్థిక ప్రయోజనం దక్కుతున్నది. ప్రస్తుతం ఎఫెక్ట్ పడే కాంట్రాక్టు ఎంప్లాయిస్ లో మెజార్టీ మంది వయస్సు ప్రస్తుతం 30నుంచి 35 ఏళ్ల మధ్య వారే ఎక్కువగా ఉన్నారు. ‘‘ఈ ఏజ్ లో కాంట్రాక్టు జాబ్ నుంచి తొలగిస్తే మేం చేయ్యాలి. ఇంతకాలం ఇదే పని చేస్తున్నాం. ఇప్పుడు బయటికి వెళ్తే ఎక్కడ జాబ్ దొరకుతుంది’’అని కాంట్రాక్టు ఎంప్లాయిస్ ప్రశ్నిస్తున్నారు. అందుకని పని ఉన్న శాఖల్లోకి తీసుకుని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

స్టడీ చేస్తోన్న ఆఫీసర్ల కమిటీ

రెగ్యులర్ ఎంప్లాయిస్ అపాయింట్మెంట్‌తో ఎఫెక్ట్ పడనున్న కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను ఏం చేయాలో సూచించాలని ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అందులో జీఏడీ,పైనాన్స్ డిపార్ట్ మెంట్స్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీలు,ఓ రిటైర్డు ఐఏఎస్, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లోని ఓ డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు. వీరంత ఉపాధి కోల్పొయ్యే అవకాశం ఉన్న కాంట్రాక్టు ఎంప్లాయిస్ ఏఏ శాఖల్లో ఉన్నారు. ఇందులో ఎందరిని ఇతర పనులకు ఏమైన ఉపయోగించుకోవచ్చా? ఏఏ శాఖల్లో వారి సేవలు వినియోగించుకోవచ్చు?అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Next Story