MMTS రైళ్లలో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం క్లారిటీ

by Gantepaka Srikanth |

హైదరాబాద్ వాసులకు కీలక రవాణా మార్గమైన ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే (SCR) మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి.

MMTS రైళ్లలో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వాసులకు కీలక రవాణా మార్గమైన ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే (SCR) మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని ప్రచారాలపై ప్రభుత్వం స్పందిస్తూ, అధికారిక వివరణ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (HMA), పట్టణాభివృద్ధి శాఖ సంయుక్తంగా తెలంగాణ ప్రభుత్వం తరపున దక్షిణ మధ్య రైల్వేకు ఒక ప్రతిపాదనను సమర్పించాయి. లేఖ ద్వారా ఈ అధికారిక ప్రతిపాదనను రైల్వే శాఖకు పంపారు. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ ప్రతిపాదనపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందిస్తూనే, కొన్ని సాంకేతిక అంశాలను ప్రస్తావించింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన నిబంధనలతో కూడిన ఒప్పందాన్ని (MoU) సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తుది నిర్ణయం తీసుకోవాలంటే, ఈ ప్రతిపాదనను రైల్వే బోర్డు ఆమోదానికి పంపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రైళ్ల సంఖ్య, సమయాలు, స్టేషన్లలో కల్పించే సౌకర్యాలపై పూర్తి అధికారం రైల్వే బోర్డు నిబంధనల ప్రకారమే ఉంటుందని వెల్లడించింది.

అసత్య ప్రచారాలను నమ్మవద్దు..

ఈ అంశం ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణంపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి గందరగోళానికి గురికావద్దు. ప్రభుత్వం ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రైల్వే బోర్డు ఆమోదం, ఒప్పంద ప్రక్రియ పూర్తయిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Next Story