ఐడీ కార్డుల మార్ఫింగ్‌కు సర్కార్ చెక్.. QR కోడ్‌తో సచివాలయ ఉద్యోగులకు కొత్త ఐడీలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-01 11:40:48  IST  )

తెలంగాణ సచివాలయంలో కొందరు నకిలీ ఐడీ కార్డులతో లోపలికి ప్రవేశించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

ఐడీ కార్డుల మార్ఫింగ్‌కు సర్కార్ చెక్.. QR కోడ్‌తో సచివాలయ ఉద్యోగులకు కొత్త ఐడీలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయంలో కొందరు నకిలీ ఐడీ కార్డులతో లోపలికి ప్రవేశించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల ఐడీ కార్డుల మార్ఫింగ్‌ను చెక్ చేస్తూ, నేటి నుంచి సచివాలయ ఉద్యోగులకు అత్యాధునిక టెక్నాలజీని జత చేస్తూ కొత్త ఐడీ కార్డుల పంపిణీని ప్రారంభించారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో సచివాలయంలో ఫేక్ ఐడీ కార్డులతో ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించడం, సెల్ఫీలు తీసుకోవడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. భద్రతా లోపాలు స్పష్టమవ్వడంతో పోలీసు శాఖ సిఫార్సుల మేరకు సాంకేతికంగా అభివృద్ధి చేసిన కొత్త ఐడీ కార్డులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే, కొత్త ఐడీ కార్డుల్లో తెలంగాణ తల్లి విగ్రహం, సచివాలయం లోగో, ఉద్యోగి ఫోటో, ఎంప్లాయీ ఐడీ నెంబర్, QR కోడ్ (స్కాన్ చేసి తక్షణమే వివరాలు ధృవీకరించే వీలు కలిగేలా) మరియు ఇంటర్నల్ చిప్ (RFID టెక్నాలజీ)ను జత చేశారు. దీంతో ఐడీ కార్డు మార్ఫింగ్, నకిలీ తయారీ అవకాశం దాదాపు తుడిచిపెట్టబడింది. ప్రస్తుతం సచివాలయంలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు సుమారు 1,300 మందికి, క్లాస్-4 ఉద్యోగులు 300 మందికి మొదటి దశలో ఈ కొత్త ఐడీ కార్డులు అందజేస్తున్నారు. త్వరలో మిగిలిన ఉద్యోగులకు కూడా పంపిణీ పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తాజా పరిణామంతో సచివాలయంలో భద్రత మరింత బలోపేతమవుతుందని, ఉద్యోగుల పేరుతో సచివాలయంలోకి నకిలీ ఎంట్రీలు అడ్డుకట్టపడతాయని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఇటీవలే ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భద్రతా చర్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story