- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Good news: జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం.. చెక్కుల పంపిణీ చేసిన సీతక్క కీలక వ్యాఖ్యలు
ప్రజా ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా ఉంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా ప్రభుత్వం (journalists) జర్నలిస్టులకు అండగా ఉంటుందని మంత్రి సీతక్క ఇచ్చారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జర్నలిస్టులు సమాజంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారన్నారు. అదే విధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారని తెలిపారు. అందుకు నిదర్శనం తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షల మేరకు తమ ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అనే సందర్భంగా తెలంగాణలోని గ్రామీణ విలేకరి నుండి ఉన్నత జర్నలిస్టుల వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మిగతా సమాజానికి ఆదర్శంగా నిలిచారని వారి సేవలను కొనియాడారు. తెలంగాణ మీడియా అకాడమీ చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించడం వలన ఆయా కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అదే విధంగా జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం వలన క్షేత్రస్థాయిలోని విలేకరులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకంలో ఇండ్లు లేని జర్నలిస్టులకు ఇండ్లను కేటాయించాలని, మరణించిన కుటుంబాలకు హెల్త్ కార్డులు అందజేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్లు మంత్రి సీతక్క (Good news) గుడ్‌న్యూస్ చెప్పారు.
సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సి.హెచ్. ప్రియాంక (C.H. Priyanka) మాట్లాడుతూ.. మీడియా అకాడమీ భవనం బహుళ అంతస్తులలో కొనసాగుతున్నందున అందులో శిక్షణ కొరకు ఆడిటోరియం ఉండడంతో జర్నలిస్టులకు ఏ.ఐ, సోషల్ మీడియా, భాషపై పట్టు కోసం నిరంతరం జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. జర్నలిస్టుల సౌకర్యార్ధం కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె శుభవార్త చెప్పారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి సూచన మేరకు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న పౌర సంబంధాల అధికారులకు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణను ఏర్పాటు చేస్తామన్నారు.
మరణించిన వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబానికి రూ. లక్ష
మరణించిన వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబానికి రూ. లక్ష చొప్పునా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మరణించిన 18 మంది వర్కింగ్ జర్నలిస్టుల ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలతో పాటు ఐదు ఏళ్ల వరకు పెన్షన్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రమాదాలు, దీర్ఘకాలికంగా అనారోగ్యం బారిన పడిన ఆరుగురు వర్కింగ్ జర్నలిస్టులకు లక్ష రూపాయలు, ఒక జర్నలిస్టుకు యాభై వేలు, మొత్తం రూ.24.50 లక్షలు ఆర్థిక సహాయం చెక్కులను లబ్దిదారులకు అందజేసినట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని జిల్లాలలో శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. అంతేగాక ఏ.ఐ, సోషల్ మీడియా, ఉర్దూ, గిరిజన జర్నలిస్టులకు ప్రత్యేక వర్క్ షాప్ లు నిర్వహించి వృత్తిలోని నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవాలో జర్నలిస్టులకు వివరించి అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ములుగు జిల్లాలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు చైర్మన్ మంత్రికి తెలియజేశారు. జర్నలిజం వృత్తిలో పని ఒత్తిడి కారణంగా అకాల మరణాలు, అనారోగ్యాల పాలు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమ నిధులపై వచ్చే వడ్డీని మాత్రమే జర్నలిస్టుల సంక్షేమానికి వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, జర్నలిస్టు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






