- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధ్యాయులకు తీపి కబురు.. రేపటి నుంచి ప్రమోషన్ల ప్రక్రియ షురూ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గెజిటెడ్ హెడ్ మాస్టర్(జీహెచ్ఎం), స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు అనుమతులిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అయితే పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్‌లను అవసరమైన పాఠశాలల్లో నియమించాలనే షరతుతో ఈ పదోన్నతులు జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 2 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా, మొత్తం పది రోజుల్లో పూర్తవుతుంది. రీజనల్ జాయింట్ డైరెక్టర్లు(ఆర్జేడీలు), జిల్లా విద్యా శాఖాధికారులకు(డీఈఓలు) ఈ షెడ్యూల్‌ను కమ్యూనికేట్ చేయాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పదోన్నతుల షెడ్యూల్ ఇదే..
ఆగస్టు 2: గెజిటెడ్ హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీలను ఆన్‌లైన్‌లో సంబంధిత డీఈఓల వెబ్‌సైట్లలో ప్రదర్శిస్తారు. గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులకు పదోన్నతి కోసం స్కూల్ అసిస్టెంట్‌లు, స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కోసం సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ)ల సీనియారిటీ జాబితాను ప్రదర్శిస్తారు.
ఆగస్టు 3: ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ల తాత్కాలిక సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు
ఆగస్టు 4, 5: అభ్యంతరాల పరిష్కారం, తుది సీనియారిటీ జాబితాల విడుదల
ఆగస్టు 6: పదోన్నతులకు స్కూల్ అసిస్టెంట్‌లు వెబ్ ఆప్షన్ల ఎంపిక
ఆగస్టు 7: గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి ఉత్తర్వులు
ఆగస్టు 8, 9 : గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులకు పదోన్నతి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత స్కూల్ అసిస్టెంట్‌లు, ఆయా కేడర్లలోని ఖాళీల జాబితాను ప్రదర్శిస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించి, పరిష్కరిస్తారు. అనంతరం తుది జాబితాలను ప్రచురిస్తారు.
ఆగస్టు 10: స్కూల్ అసిస్టెంట్‌లు, తత్సమాన కేడర్‌ల పదోన్నతి కోసం సెకండరీ గ్రేడ్ టీచర్స్ వెబ్ ఆప్షన్ల నమోదు
ఆగస్టు 11: కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్స్ పదోన్నతి ఉత్తర్వులు జారీ
2వేల మంది టీచర్లకు ప్రమోషన్స్
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించనున్నాయి. గతేడాది సుమారు 1,500 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల మల్టీజోన్-2లో మిగిలిపోయిన, పదవీ విరమణ వలన సుమారు 750 గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పించి వీటిని భర్తీ చేయనున్నారు. అదేవిధంగా పదోన్నతులతో ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్జీటీలతో భర్తీ చేస్తారు. డీఎస్సీ 2012 తర్వాత పీఈటీ, భాషా పండితులకు కూడా అప్ గ్రేడ్ చేయాల్సిన 800 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారికి కూడా పదోన్నతులు కల్పించనున్నారు. ఇలా దాదాపుగా 2 వేల మంది పదోన్నతులు పొందే అవకాశం ఉంది.






