ఉద్యోగ సంఘాల జేఏసీ‌కి గుడ్ న్యూస్.. డిమాండ్స్‌కు సర్కార్ సానుకూలం!

by Kema Shiva Kumar |

సెప్టెంబరు ఫస్ట్ వీక్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఉద్యోగ సంఘాల జేఏసీ‌కి గుడ్ న్యూస్.. డిమాండ్స్‌కు సర్కార్ సానుకూలం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెప్టెంబరు ఫస్ట్ వీక్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పెండింగ్ అంశాలను పరిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న డీఏలు,రిటైర్డ్ ఎంప్లాయిస్ బెనిఫిట్స్ పై సానుకూల నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నట్లు సమాచారం. 63 డిమాండ్లను పరిష్కరించాలంటూ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి, సెప్టెంబరు 1 నుంచి జిల్లా స్థాయి ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వెంటనే పరిష్కారమయ్యే అంశాలపై నిర్ణయం ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

డిప్యూటీ సీఎం భట్టితో చర్చలు

ఈనెల 30న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబరు 2 లేదా 3 వ తేదీ వరకు జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశాలు ముగిసిన తరువాత ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే, పెండింగ్ సమస్యల పరిష్కారం చేయాలంటూ సర్కారుకు నోటీసు ఇచ్చిన ఉద్యోగులు సెప్టెంబరు 1 నుంచి జిల్లా స్థాయిలో ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. అలాగే, సెప్టెంబరు 1న సీపీఎస్ రద్దుపై పెద్ద ఎత్తున ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారు. దీనితో ప్రభుత్వం ఎంప్లాయీస్ సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. చర్చల అనంతరం ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పరిష్కారమయ్యే సమస్యలపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

డీఏ అమలుపై జీవో విడుదల

5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఒక డీఏను డిసెంబరు నెల నుంచి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం ఉంది. ఈ విషయంపై గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, డీఏ అమలు కోసం ప్రభుత్వం జీవో విడుదల చేయాలని యోచనలో ఉంది. అలాగే.. ప్రతి నెలా రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ చెల్లించేందుకు దాదాపు రూ.750 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటివరకు జులై మాసంలో మాత్రమే పూర్తి స్థాయి అమౌంట్‌ను చెల్లించారు. అగస్టు నెలలో దాదాపు రూ. 400 కోట్ల వరకు విడుదల చేశారు. ఇప్పట్నించి ప్రతినెల రూ.750 కోట్ల వరకు నిధులు కచ్చితంగా విడుదల చేస్తామని హామీని ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది.

Next Story