అన్నదాతలకు తీపికబురు.. రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతువపనాలు

by Shiva |
అన్నదాతలకు తీపికబురు.. రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతువపనాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నాయని తెలిపింది. వర్షాల కారణంగా వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉంటుందని, పంటలు బాగా పండే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపారు. దీర్ఘకాలిక సగటు కంటే 87 సెం.మీ ఉండగా, ఈ సారి 105 శాతం అధికంగా రికార్డ్ అవుతుందని ఐఎండీ వెల్లడించింది. అయితే ఈ సారి ఎల్ నినో వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదని పేర్కొంది.

పలుచోట్ల తక్కువగానే..

దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వాయువ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కవగానే వర్షాలు పడతాయని వెల్లడించింది. రుతుపవనాల సీజన్‌కు సంబంధించిన కొత్త అంచనాలను మే చివరి వారంలో ఐఎండీ విడుదల చేయనుంది.

‘సాగు’కు అనుకూలంగా..

వ్యవసాయానికి రుతుపవనాలు చాలా కీలకం. సాగునీటి వసతి లేని చాలా ప్రాంతాలు వర్షాలపైనే ఆధారపడి ఉంటాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పంటల దిగుబడిని పెంచడానికి దోహదపడటమే కాకుండా సాగు, తాగు నీటికి అవసరమైన రిజర్వాయర్లను నింపడానికి సహాయపడుతుంది. మంచి రుతుపవనాలు సాధారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయి. వ్యవసాయ వృద్ధికి తోడ్పడటం ద్వారా దేశ జీడీపీకి గణనీయంగా దోహదం చేస్తాయి. ఆహార ధరలకు సంబంధించిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. అయితే 2025 రుతుపవనాల కాలంలో తటస్థ ఎల్ నినో-సౌతర్న్ ఆసిలేషన్ (ఎన్సో) పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Next Story

Most Viewed