తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

మహిళా సంఘ సభ్యుల్లో ఎవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.

తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. మంత్రి సీతక్క కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా సంఘ సభ్యుల్లో ఎవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. అక్షర‌ జ్ఞానంతో పాటు వారి విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. మ‌హిళా సభ్యుల ఎడ్యుకేష‌న్ ప్రొఫైల్స్‌ను సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. శనివారం సెర్ఫ్ కార్యాలయంలో సీఈఓ దివ్యా దేవరాజన్‌తో క‌లిసి మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం, నూతన సభ్యుల చేరిక, ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం, సెర్ప్ అమలు చేస్తున్న పథకాల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణం యజ్ఞంలా కొనసాగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,227 గ్రామ మహిళా సంఘ భవనాలకు అనుమతులు మంజూరు కాగా, 5239 భవనాల కోసం స్థలాల ఎంపిక పూర్తయి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, పనులను వేగవంతంగా చేస్తున్న అధికారులను అభినందించారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు గ్రామాల్లో పర్యటించి విజయవంతమైన కథనాలను ఇతర గ్రామాల్లో పంచుకోవడం ద్వారా మహిళా సభ్యులను ప్రేరేపించాలని సూచించారు. ప్రస్తుతం 5 వేలకుపైగా వీఓ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని, వచ్చే సంవత్సరం మరో ఐదు వేల భవనాలు నిర్మిస్తామన్నారు. వంద శాతం రీపేమెంట్ చేసిన గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ భవనాల నిర్మాణం చేపడతామని, తగిన ప్రోత్సాహాలు అందిస్తామని వెల్లడించారు.

అమ్మకు అక్షర మాల విజయవంతం చేయాలి..

‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాన్ని మహిళా సంఘాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో చదువు అవకాశాలు లేకపోయిన మహిళలకు ఈ కార్యక్రమం ద్వారా అక్షరజ్ఞానం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆరు లక్షలకుపైగా మహిళలకు చదువు నేర్పించామని, త్వరలో మరో 6 లక్షల మందికి గ్రామస్థాయిలోనే విద్యాబోధన చేపడతామని చెప్పారు. బాల్య వివాహాల వంటి సామాజిక సమస్యలను అరికట్టడంలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. త్వరలో మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో మహిళలు రాజకీయ నాయకులుగా ఎదగాలని ప్రోత్సహించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంటూ, ప్రతి మహిళా సంఘం ఆర్థిక క్రమశిక్షణతో పని చేయాలన్నారు. కేవలం రుణాలు పొందడం కాకుండా, ఆ రుణాలను లాభదాయక వ్యాపారాలుగా మార్చుకునే మార్గాలను మహిళలకు నేర్పించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త సభ్యుల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రతి మహిళ సంఘ సభ్యురాలిగా మారేలా కృషి చేయాలని సూచించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు టీనేజ్ బాలికల కోసం ‘స్నేహా సమ్మర్ ప్రోగ్రామ్’ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైఫ్ స్కిల్స్, సాధికారత, విద్యా కొనసాగింపు, ఆరోగ్య పరిరక్షణ, భద్రత అంశాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. భవిష్యత్తులో బాలికలు సొంతంగా ఎదగడానికి బైక్ రైడింగ్ వంటి నైపుణ్యాలు నేర్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా సమ్మర్ ట్రైనింగ్‌లో సైకిల్ తొక్కడం కూడా నేర్పిస్తామని పేర్కొన్నారు.

Next Story