- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good news : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. 2.1 శాతం డీఏ పెంపు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఆర్టీసీ కార్మికుల కరువు భత్యాన్ని (డీఏ) 2.1 శాతం పెంచుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రకటించారు. తాజా పెంపుతో ఇప్పటివరకు 50.7 శాతంగా ఉన్న డీఏ, ఇప్పుడు 52.8 శాతానికి చేరింది.
ఏప్రిల్ జీతంతో పాటే బకాయిలు..
పెరిగిన ఈ డీఏ జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. గత మూడు నెలల (జనవరి, ఫిబ్రవరి, మార్చి) బకాయిలను ఏప్రిల్ వేతనంతో పాటే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 38 వేల మందికి పైగా ఆర్టీసీ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. అయితే, డీఏ పెంపు కారణంగా సంస్థపై నెలకు రూ. 2.82 కోట్ల అదనపు భారం పడనుంది.
పెండింగ్ డీఏలన్నీ క్లియర్
గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న డీఏలన్నింటినీ తమ ప్రభుత్వం వరుసగా విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాజా పెంపుతో ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలన్నీ పూర్తయ్యాయన్నారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందుకే కారుణ్య నియామకాలు, విధులకు దూరమైన వారిని తిరిగి తీసుకోవడం, ఆర్టీసీ ఆస్పత్రి ఆధునీకరణ లాంటి ఎన్నో చర్యలు చేపట్టామని ఆయన గుర్తుచేశారు. ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి, ఇతర ఈడీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ డీఏ పెంపు నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల ఎండీ నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ఇది సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






