రాష్ట్రంలోని విద్యార్థులకు తీపికబురు.. ప్రభుత్వ హాస్టళ్లలో ఇక చేపల కూర

by Kema Shiva Kumar |

ప్రభుత్వ హాస్టల్స్‌, క్రీడా పాఠశాలల్లో చేపల కూరను వడ్డించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది.

రాష్ట్రంలోని విద్యార్థులకు తీపికబురు.. ప్రభుత్వ హాస్టళ్లలో ఇక చేపల కూర
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ హాస్టల్స్‌, క్రీడా పాఠశాలల్లో చేపల కూరను వడ్డించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. సంక్రాంతి తర్వాత ఈ స్కీం అమలులోకి రానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నది. జనవరి నుంచి 6,152 సంఘాల్లో సభ్యులుగా ఉన్న 4.21 లక్షల మందికి బీమా(ఇన్సూరెన్స్) సౌకర్యం కల్పించనుంది. రైతు బీమా ఎన్నో కుటుంబాలను ఆదుకోగా, అదే తరహాలో మత్స్యకారులకు సైతం బీమా ప్రకటించనుంది. సాధారణ, ప్రమాద మరణం కానీ శాశ్వత వైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక వైకల్యం రూ.2.50 లక్షలు, ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరితే రూ. 25 వేలు అందజేయనుంది. అదే విధంగా చేప ఆహారం క్రీడాకారుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత విద్యార్ధులకు చేపల కూర దొరకనుంది. మంత్రిగా వాకిటి శ్రీహరి బాధ్యతలు చేపట్టాక మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేపట్టారు.

నాణ్యమైన చేప పిల్లల కోసం రూ.122 కోట్లు

రాష్ట్రంలో మెజార్టీ కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడటంతో వారి జీవన ప్రమాణాలు మెరుగు పడేందుకు గత 2 నెలల నుంచి రూ.93 కోట్లతో 84.62 కోట్ల చేప పిల్లలను వందశాతం రాయితీతో ఉచితంగా పంపిణీకి సర్కార్​శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సుమారు 60 శాతం వరకు చేప పిల్లల పంపిణీ పూర్తియింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 26,326 చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు ఉండగా మొదటిసారి రూ.28 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను ఎంపిక చేసి 300 చెరువులో వదిలారు. చేప పిల్లల పంపిణీ ద్వారా రాష్ట్రంలో పరోక్షంగా మరో 10 లక్షల కుటుంబాలకు ఉపాధి లభించనుంది. మత్స్యకారులకు ఎప్పటికప్పుడు చేపల పెంపకంపై శిక్షణ తరగతులను సైతం ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలు, తప్పులు జరగకుండా ప్రస్తుత సర్కార్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈసారి నాణ్యమైన చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు రూ.122 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం కంటే రూ.30 కోట్లకు పైగా అధికంగా నిధులు కేటాయించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. శాశ్వత నీటి వనరుల్లో బొచ్చె 40 శాతం, రవ్వ 50 శాతం, మరిగల 10 శాతంను 80 నుంచి 100 ఎంఎం సైజులో వదిలుతుండగా, తాత్కాలిక నీటి వనరులు ఉన్న చెరువులు, కుంటల్లో బొచ్చె 35 శాతం, రవ్వ 35 శాతం, బంగారు తీగ 30 శాతంను 35 నుంచి 40 ఎంఎం సైజ్ ఉన్న చేప పిల్లలను స్థానిక ప్రజాప్రతినిధులు వదిలారు.

కోహెడ వద్ద అత్యాధునిక హంగుల్లో మార్కెట్​ నిర్మాణం..

గ్రేటర్​శివారు ప్రాంతమైన కోహెడలో రూ.47.03 కోట్ల వ్యయంతో అత్యాధునిక చేపల హోల్‌సెల్​మార్కెట్‌ను​ప్రభుత్వం నిర్మాణం చేపడుతోంది. శేరిగూడ, అర్సపల్లిలో ఒక్కొక్కటి రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక చేపల హోల్‌సెల్​మార్కెట్లు సిద్ధం చేస్తున్నది. మహిళ శక్తి కార్యక్రమం కింద సెర్ప్​హైదరాబాద్​సహకారంతో గ్రామ సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు 35 మొబైల్​అవుట్​లెట్లు అందజేస్తున్నది. నేషనల్​ఇనిస్టిట్యూట్​ఆఫ్​టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ ద్వారా వంటకాల తయారీ, మార్కెటింగ్‌పై శిక్షణ చేపడుతోంది. మత్స్యకారులకు తక్షణం వలలు, పడవలు, ఆధునిక పరికరాలు, రవాణా వాహనాలు అందజేయనుంది. చిన్న స్వదేశీ చేపల జాతుల పైలెట్​ప్రాజెక్టు కింద పోషకాహారాన్ని ఎదుర్కోవడానికి మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి అస్సాం, ఒడిశాలోని విజయవంతమైన నమూనాల నుంచి రూ.8 కోట్లతో కూడిన మార్గదర్శక ప్రాజెక్టు చేపడుతోంది. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు మాదిరిగా ఫిషరీస్ స్కీం కింద రూ.2 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తీసుకోవచ్చు. ఈ కార్డు వ్యాలిడిటీ ఐదేళ్ల వరకు ఉంటుంది. ఏడాదికి 4 శాతం మాత్రమే వడ్డీ రేటు ఉంటుంది. రేవంత్​ప్రభుత్వం మొట్టమొదటిసారి కరీంనగర్ జిల్లాలో కొర్రమీను ఉత్పత్తి ఫామింగ్‌ను రూ.2.5 కోట్లతో నిర్మాణం చేపడుతోంది. నాలుగైదు నెలల్లో రాష్ట్రంలో కొర్రమీను ఉత్పత్తి భారీగా పెరుగుతుందని మత్స్యశాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా భారీ నీటి ప్రాజెక్టుల వద్ద చేపల విత్తన కేంద్రాలకు స్థలాలు తీసుకుని కొర్రమీను ఉత్పత్తి ప్రారంభించబోతున్నట్లు అధికారులు చెప్పారు.

తెలంగాణ చేపకు ప్రత్యేక బ్రాండ్​ తెచ్చేలా ప్లాన్..

రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తెలంగాణ చేపకు ప్రత్యేక బ్రాండ్​తీసుకొచ్చేందుకు నూతన విధానాలు అవలభించనున్నారు. త్వరలో గుజరాత్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకు అధికారుల బృందం వెళ్లి అక్కడ చేపల పెంపకంపై అధ్యయనం చేసి వాటికంటే దీటుగా చేపల ఉత్పత్తి జరిగేలా ప్లాన్​చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో సమీక్షలు జరిపి రేవంత్​ప్రభుత్వ పాలనలో చేపల ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి చెందేలా చేయాలని ఆదేశించారు. నిధుల విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని కూడా హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Next Story