ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 11 శాతం ఫిట్‌మెంట్‍పై మంత్రి పొన్నం కీలక ప్రకటన

by Prasad Jukanti |

30 నెలల ప్రజా పాలనలో ఆర్టీసీ పురోగతిపై సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 11 శాతం ఫిట్‌మెంట్‍పై మంత్రి పొన్నం కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ (RTC)సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్పీఎస్-2021కు సంబంధించిన 11 శాతం ఫిట్‌మెంట్‌ను జూలై 1 నుంచి అమలు చేయబోతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రకటించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల అధికారితో చర్చించి సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సచివాలయంలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగి శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుండి సేకరించిన నిధులతో రూ.1 కోటి చెక్కును అందజేయాలని, దాంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ప్రమాద బీమా పథకం కింద ఇప్పటివరకు 11 కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున చెక్కులు అందించినట్లు మంత్రి తెలిపారు.

30 నెలల్లో ఆర్టీసీ పురోగతి

ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. 2023-26 మధ్యకాలంలో రూ.1,078 కోట్ల వ్యయంతో 2,815 నూతన బస్సులను కొనుగోలు చేశామని, బ్రెడ్ విన్నర్ స్కీమ్, మెడికల్ ఇన్వాలిడేషన్ కింద మొత్తం 1,137 కారుణ్య నియామకాలు (888 మంది కండక్టర్లు, 10 మంది డ్రైవర్లు, 43 మంది శ్రామిక్‌లు, 196 మంది కానిస్టేబుళ్లు) చేపట్టామని, పెండింగ్‌లో ఉన్న అర్హులైన కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వీసు నుంచి తొలగించబడిన 490 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 244 మందిని విధుల్లోకి తీసుకున్నామని, మిగిలిన కేసులను త్వరితగతిన పరిశీలించాలని సూచించారు. మహాలక్ష్మీ పథకం మహిళల ఆర్థిక సాధికారతపై చూపుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేసి ఫీడ్‌బ్యాక్ నమోదు చేయాలని ఆదేశించారు.

బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల కల్పనపై మంత్రి సమీక్షించారు. నాగర్‌కర్నూల్, పెద్దపల్లి బస్ డిపో పనులను వేగవంతం చేయాలని, ములుగు బస్ స్టేషన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో వేములవాడ, కథలాపూర్ బస్ స్టేషన్‌లకు శంకుస్థాపనలు చేయాలని, మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అక్కడి బస్ స్టేషన్‌కు శంకుస్థాపన జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. హుజూర్‌నగర్, కోదాడ, నాగర్‌కర్నూల్ బస్ స్టేషన్‌ల శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేయాలన్నారు. మంచిర్యాల, చెన్నూరు, మెదక్, బెల్లంపల్లి, పరకాల తదితర ప్రాంతాల్లో అధికారులు వ్యక్తిగతంగా విజిట్ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఎలక్ట్రిక్ బస్సులు - దక్షిణ భారత మంత్రుల సమావేశం

రాష్ట్రంలో ప్రస్తుతం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, వాటి లాభనష్టాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి కోరారు. కాలుష్య నియంత్రణ, ఈవీ విధానంపై త్వరలోనే దక్షిణ భారత రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, ఆర్టీసీ ఎండీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సీఎస్ఎస్ బకాయిలు రూ.1,096.90 కోట్ల నుంచి రూ.862 కోట్లకు తగ్గాయని, పీఎఫ్ బకాయిలు రూ.2,018.15 కోట్ల నుంచి రూ.1,714.39 కోట్లకు తగ్గాయని తెలిపారు. అలాగే ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ బకాయిలను కూడా రూ.493.02 కోట్ల మేర తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, ఈడీలు వెంకన్న, కుష్రోశా ఖాన్, రాజశేఖర్, శ్రీధర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయపుష్ప తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story