రిటైర్డ్ ఉద్యోగులకు తీపికబురు.. రూ.1,000 కోట్ల బకాయిలు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-29 10:14:25  IST  )

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. రూ.1,000 కోట్ల బకాయిలను ఇవాళ ఆర్థిక శాఖ విడుదల చేసింది.

రిటైర్డ్ ఉద్యోగులకు తీపికబురు.. రూ.1,000 కోట్ల బకాయిలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏకంగా రూ.1,000 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ (GPF) బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. 2025 అక్టోబర్ వరకు పేరుకుపోయిన అన్ని బకాయిలను ఒకేసారి విడుదల చేయడంతో వేలాది మంది మాజీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆగిపోయిన ఈ నిధులు ఇప్పుడు నేరుగా వారి ఖాతాల్లోకి చేరనున్నాయి.

నెలవారీ చెల్లింపులు పెంపు..

బకాయిల విడుదలతో పాటు, భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నెలా చేసే చెల్లింపుల పరిమితిని మరో రూ.1,000 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఉద్యోగులకు సంబంధించిన క్లెయిమ్‌లు, బిల్లులు ఇకపై పెండింగ్‌లో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమన్వయం చేసుకుంటూనే, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బకాయిల విడుదల నిర్ణయం ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని వారు పేర్కొన్నారు.

కాగా, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లిపులో జాప్యంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాబోయే 100 రోజుల్లోగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన రూ.6,200 కోట్ల బకాయిలు చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే నిర్ణయించింది. మంత్రులు, కొందరు ప్రజాప్రతినిధులకు ఇచ్చే జీతాల్లో 50 శాతం నిలుపుదల చేసి.. వాటిని రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం సిద్ధం చేసే నిధులతో కలిపి సర్దుబాటు చేయాలని తీర్మానించింది. తక్షణమే ‘రెవెన్యూ రిసోర్సెస్‌ మొబిలైజేషన్‌ కమిటీ’ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story