సినీ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ‘ఐమ్యాక్స్‌’ థియేటర్‌!

by Ramesh Naini |   (  Updated:2026-06-01 13:15:05  IST  )

హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా మూవీ లవర్స్‌కు ఒక అద్భుతమైన వార్త. దాదాపు చాలా కాలం తర్వాత భాగ్యనగరంలో ఐమ్యాక్స్‌ ఫార్మాట్ మళ్లీ అందుబాటులోకి రాబోతోంది.

సినీ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ‘ఐమ్యాక్స్‌’ థియేటర్‌!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా మూవీ లవర్స్‌కు ఒక అద్భుతమైన వార్త. దాదాపు చాలా కాలం తర్వాత భాగ్యనగరంలో ఐమ్యాక్స్‌ (IMAX) ఫార్మాట్ మళ్లీ అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు సౌత్ ఇండియాలోనే ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఏఎంబీ సినిమాస్’ (AMB Cinemas) అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అల్ట్రా లగ్జరీ అనుభూతి

సినీ వీక్షకులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ప్రతిష్టాత్మక ‘సుదర్శన్ 70MM’ థియేటర్ ప్రాంగణంలో ఈ మల్టీప్లెక్స్ శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది. దీనికి ‘ఏఎంబీ క్లాసిక్ విక్టరీ’ అని నామకరణం చేశారు. మాస్ హబ్‌గా పేరొందిన ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అల్ట్రా లగ్జరీ ఐమ్యాక్స్ స్క్రీన్ రావడం గమనార్హం.

సంయుక్త నిర్మాణం.. సరికొత్త టెక్నాలజీ

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ గ్రూప్ (సునీల్ నారంగ్, భరత్ నారంగ్)తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ (విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ఐమ్యాక్స్‌గా రికార్డు సృష్టించనున్న ఈ థియేటర్‌లో.. అత్యున్నత విజువల్స్, ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం అధునాతన ‘ఐమ్యాక్స్ విత్ లేజర్’ (IMAX with Laser) టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కాగా, ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే తేదీని త్వరలో ప్రకటించనున్నారు. అయితే, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ’వారణాసి’ చిత్ర విడుదల నాటికి ఈ థియేటర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

Next Story