‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. బిల్లుల విషయంలో ఇక ఆ టెన్షన్ ఉండదా?

by Gantepaka Srikanth |

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు విడుదల చేసే బిల్లుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. బిల్లుల విషయంలో ఇక ఆ టెన్షన్ ఉండదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు విడుదల చేసే బిల్లుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఆధార్ అనుసంధాన ప్రక్రియలో (ఆధార్ పేమెంట్ బిల్ సిస్టం) బిల్స్ పేమెంట్ చేయనున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. విడతల వారీగా విడుదల చేస్తున్న బిల్లులు సకాలంలో లబ్ధిదారులకు అందేలా చూడటంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు, వారి ఇళ్ల నిర్మాణ దశను బట్టి ఆన్‌లైన్ ద్వారానే విడతల వారీగా బిల్లుల రూపంలో రూ.5 లక్షలను అందజేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పథకం కింద ఇంతవరకు సుమారు రూ.590 కోట్లను లబ్ధిదారులకు అందచేశారు. ఇటీవలి కాలంలో లబ్ధిదారుల నుంచి తమకు విడుదలైన బిల్లుల మొత్తాలు ఖాతాల్లో జమ కావడం లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈ అంశంపై లోతుగా పరిశీలించారు. లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ల వివరాల నమోదులో పొరపాట్లు, ఐఎఫ్‌ఎసస్‌సీ కోడ్‌లలో తప్పులు, వినియోగంలో లేని అకౌంట్ నంబర్లు, మొదలైన కారణాలతో ఇబ్బందులు వస్తున్న అంశాన్ని గమనించారు. ఈ సమస్యను పరిష్కరించడంతోపాటు పునరావృతం కాకుండా చూడాలన్న లక్ష్యంతో, ఆధార్ ఆధారితంగా చెల్లింపులు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా సుమారు 9,100 మంది లబ్ధిదారులకు ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లింపులు చేయగా, వాటిలో సుమారు 9,000 వరకు ఎటువంటి సమస్య లేకుండా జరిగినట్లు ఎండీ వివరించారు.

Next Story